పార్టీ బలోపేతానికే బలమైన బీసీ నేత ఎంపిక
ఈ నెల 10వ తేదీలోపే వెలువడనున్న ప్రకటన
అవును. బిజెపి స్టేట్ బాస్ గా ఈటెల రాబోతున్నారు. ప్రత్యర్థులకు దీటుగా పార్టీ బలోపేతానికి బలమైన బీసీ నేతను బరిలోకి దింపుతోంది బిజెపి. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 10వ తేదీలోగానే ఈటల నియామక ప్రకటన వెలువరించేందుకు బిజెపి రెడీ అవుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పురంధేశ్వరి నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
దేశంలో సంకీర్ణ అధికారంలో ఉన్న బిజెపి సొంత బలం కోసం పాకులాడుతోంది. అధికారం ముఖం చూడని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. దేశంలో, రాష్ట్రాల్లో నిరపేక్ష పవర్ కోసం పవర్ ఫుల్ ప్లాన్స్ వేస్తోంది. ఇందుకు దేశ వ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సానుకూలంగా మలచుకుంటోంది. బలమైన నేతలను బరిలోకి దించి బాధ్యతలు అప్పగించనుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో బలహీన వర్గాలకు చెందిన బలమైన నేత ఈటల రాజేందర్ కు బిజెపి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది.
గడిచిన ఎన్నికల నేపథ్యం, సమీప భవిష్యత్తు ఎన్నికల బేరీజులో బిజెపి తలమునకలైంది. సంప్రదాయ పార్టీగా పేరున్న బిజెపి, ఏనాడో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టింది. ఫక్తు రాజకీయ పార్టీల తరహాలో అనేక పార్టీల నేతల్ని చేర్చుకుంది. చేర్చుకుంటూనే ఉంది. పద్ధతులను పక్కనపెట్టి పవర్ పాలిటిక్స్ చేస్తున్నది. పవరే పరమావధిగా ఇప్పుడు పార్టీ దేశ, రాష్ట్రాల శాఖలకి సామాజీక సమీకరణాలతో సమర్థులైన నేతలను ఎంపిక చేస్తున్నది. ఇప్పటికే తన వారసత్వ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, కాంగ్రెస్ కర్ణాటక దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు పార్టీ పగ్గాలు అప్పగించిన విధంగానే, బిజెపి, అదే కర్ణాటకకు చెందిన దళిత వర్గ నేతకు జాతీయ పార్టీ పగ్గాలను అందించనుంది. ఇదే కోవలో తెలంగాణ పిసిసి పగ్గాలను కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి అందించిన విధంగానే ఓ బలమైన బీసీ వర్గానికి చెందిన బలమైన నేత ఈటల రాజేందర్ కు అప్పగించాలని నిర్ణయించింది. నిజానికి తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల విషయంలో అంతర్గతంగా విభేదాలతోపాటు పోటీ ఏర్పడింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు రెండు వర్గాలుగా ఒక వర్గం బండి సంజయ్ ని మరోసారి ప్రతిపాదించింది. గతంలో బండి సంజయ్ హయాంలో బీజేపీ క్షేత్రస్థాయిలో మంచి విజయాన్ని సాధించింది. బండి సంజయ్ కార్యకర్తల్లో మంచి జోష్ నింపి, పార్టీని బలోపేతం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం బండికే మద్దతు పలికారు. తన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన ఈటలతో విభేదించినప్పటికీ, కేంద్ర మంత్రిగా, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్, ఈసారి ససేమిరా అన్నారు. దీంతో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని తెరమీదకు తెచ్చారు. ఇంకోవైపు ఈటలకు మరోవర్గం మద్దతుగా నిలిచింది. పోటీలో ఉన్నప్పటికీ తమకు కానట్లైతే, ఈటల కోసం నిలబడడానికి ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి వారు అంగీకరించారు. కాగా బండి సంజయ్ ఈటలకు మద్దతు పలికారని తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన బీసీ నేతకే జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది.
ఇదిలావుండగా, ఒక బలమైన బీసీ నేత కోసం చూస్తున్న కేంద్ర నాయకత్వానికి సామాజికంగా, ఆర్థికంగా, సమర్థుడైన ఈటల సరిపోతాడని భావించినట్లు తెలుస్తోంది. కేశవ మెమోరియల్ స్కూల్ లో చదువుకున్న ఈటల, తర్వాత వామపక్ష భావజాలంతో పని చేసినప్పటికీ, రాజకీయ పరమపద క్రీడలో 2021లో బిజెపిలో చేరారు. 2003 నుంచి బిఆర్ఎస్ (టిఆర్ఎస్)లో చేరి, ఉద్యమాల్లో పాల్గొంటూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పని చేశారు. తాజాగా మల్కాజీగిరి ఎంపీగా ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా పని చేశారు.
అయితే ఆయన వామపక్ష ఉద్యమ, సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాజకీయ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ క్యాడర్ తో ఉన్న అనుబంధం అనుకూలిస్తుందని, అతని బలమైన సమాజిక వర్గం సానుకూలిస్తుందని, వచ్చే స్థానిక సంస్థలు, జీ,హెచ్.ఎం.సి ఎన్నికల్లో పవర్ ప్రతిఫలిస్తుందని బిజెపి తలపోస్తోంది.

