అమెరికాలో లక్షల్లో వేతనం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి తనకు జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధి కోసం ఒక్క ఎన్ఆర్ఎ రావడం మెదక్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్నశంకరంపేటకు చెందిన కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో స్థిరపడినప్పటికీ, గ్రామాభివృద్ధిపై ఉన్న ఆసక్తితో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ ప్రజల చెబుతున్న వివరాల ప్రకారం, చంద్రశేఖర్ తాత శంకరప్ప దాదాపు నలభై ఏళ్లు గ్రామానికి సేవలు అందించారు. ఈ కుటుంబం గ్రామంలో మంచి పేరు, ప్రేమ, ఆప్యాయతలు సంపాదించుకుంది. తాత అడుగుజాడల్లో నడుచుకుంటూ గ్రామ పురోభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ ఆరు నెలల క్రితమే అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరణను పెంచుకుంటున్నాడు. శుభ్రత కార్యక్రమాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, పెద్దవారికి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఈ నెల 30న సర్పంచ్ పదవికి నామినేషన్ వేయాలని ఆయన నిర్ణయించుకోవడంతో గ్రామంలో ఎన్నికల వేడి పెరిగింది. గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ నాయకుడిని ప్రజలు గెలిపిస్తారా… లేదా… అనేది కౌంటింగ్ వరకు వేచి చూడాలి.

