గీ శేతిల పోన్లొచ్చినకానుంచి, మనుసులు, సమాజం, పపంచకమే ఎవ్వలి శేతిల లేకుండపోతాంది. బుడ్డ పోరగాండ్ల కానుంచి ముసలొల్ల దాకా అందరి శేతుల్ల పోన్లేనాయె. గడికోపాలి గండ్ల యేలు పెట్టి గెలుకుడేనాయె? తలకాయ పెట్టి సూసుడేనాయె? ఆలుమొగలు కూడా శెరో దిక్కు శేతిల పోన్లు సూసుకుంట ఎడమొకం, పెడమొకంగా పండుకోబట్టిరి. సందు దొరికినా, దొరకకపోయిన, గా శేతిల పోన్లల్లనే మనుసులు గడపబట్టిరి. ఇగ గవాటిని సూసి పానాలు తీకోబట్టిరి. గట్లనే గా పోన్లల్ల సెల్పీల కోసం పానాలు పోగొట్టుకోబట్టిరి.

గా సీకాకులంల గట్లనే సెల్పీ మోజుల నీల్లల్ల పడి పానాలు పొగొట్టుకున్నరు. ఒగ మార్కెటింగ్ ఏజెన్సీల 125 మంది శిచ్చణ సీకుంటాండ్రట. గండ్లకెల్లి దసరా సెలవులకు 100 మంది ఇండ్లకు పోయిండ్రట. మిగిలిన 25 మందిల ముగ్గురు అమ్మాయిలు కలిసి పెద్దగనగళ్లవానిపేట సంద్ర తీరానికి పోయిండ్రు. గాడ నాగావళి నది సంద్రంల కలుత్తది. గాడనే ఓ ఊబి ఉందట. గది నిషేధిత ప్రాంతమని కూడ ప్రకటన రాసి ఉందట. గా పిల్లలు గాడికి పోయి సెల్పీ దిగుతాంటే గా ఊబిల పడ్డరట. గాదాని మీదికెల్లి పెద్ద కెరటం వచ్చి మీద పడ్డదట. గంతే గా ముగ్గురు గంగమ్మ ఒడిల కలిసిండ్రట. గిది సూసిన ఓ పిల్లగాడు గవాల్లను రచ్చిద్దామని గండ్లకే దూకిండంట. గంతే గా పొల్లగాడు కూడా కనిపించకుండ పోయిండంట. ఇగ గవాల్లు రెండు రోజుల తర్వాత శవాలై తేలిండ్రట. ఇగో గిట్లనే నదులల్ల, మిద్దెల మీదికెల్లి పడి పానాలు పోగొట్టుకుంటాండ్రు. ఇగో మీ అందరికీ దండం పెట్టి శెపుతాన. గా సెల్పీల కోసంపానాలు తీసుకోవద్దు.

