ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందలేదని సర్వత్రా విమర్శ

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 13 (అడుగు న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో, మండల కేంద్రాలలో… వివిధ గ్రామాలలో అభివృద్ధి పనుల పేరిట కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు నాయకులు ముగ్గులు పోస్తున్నారు. కానీ జరుగుతున్న పనుల నాణ్యత పై ఎవరు దృష్టి పెట్టడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలను విస్మరించారనే అపవాదు రేవంత్ ప్రభుత్వం మూటగట్టుకుంది. వివిధ పనులకు గాను కోట్లాది రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు పలుచోట్ల శంకుస్థాపనలు చేశారు. జరుగుతున్న పనులపై నాణ్యతను గుర్తించాల్సిన అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి పనులు జరిగితే వాటి ఫలాలు కనీసం దశాబ్ద కాలం పాటైన నాణ్యతగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలి. కాంట్రాక్టర్లు ఏదో పనులు చేశామనిపించి చేతులు దులుపుకుంటున్నారు. సర్కార్ నుండి మాకు డబ్బులు వచ్చినప్పుడు కదా చూద్దాం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పనుల నాణ్యత పై వారు ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని సర్వత్ర విమర్శలున్నాయి. గ్రామాలలో పట్టణాలలో సిసి రోడ్లు, డ్రైనేజీల పనులు ప్రస్తుతం క్రమం తప్పకుండా జరుగుతున్నా పనులు నాణ్యత అరకొరగా ఉంటున్నాయన్నది నగ్న సత్యమని ఆయా ప్రాంతాల ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను పూర్తి నిర్లక్ష్యంతో చేస్తున్నారని ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని తీవ్ర విమర్శలు ఉన్నాయి. దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు ప్రజోపయోగంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

