తెలంగాణ ఎమ్మెల్సీల నియామకాలకు సంబంధించిన కేసులో తుది వాదనలను ఫిబ్రవరి 12న వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్ సర్కారు హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా, అప్పటి గవర్నర్ తమిళిసై వీటిని తిరస్కరించారు. ఈ నిర్ణయంపై శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత, అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు 2023 జనవరి 13న కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదించారు. ఈ నియామకాలను సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసింది.
దీనిపై ప్రభుత్వం మరోసారి కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదంతో వారు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. దీంతో న్యాయం చేయాలంటూ 2023 ఆగస్టు 4న శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ గవర్నర్ కార్యాలయంతో పాటు ఈ కేసులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

