ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి.

బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు చెందిన లలన్ మిశ్రాకు నిర్మలాదేవితోటి 1977ల పెండ్లైంది. కాపురమన్నంక కలహాలుండయా ఏంది? గట్లనే గా పెండ్లాం మెగలు గలాటా పడ్డరు. పెండ్లానికి కోపమొచ్చింది. పుట్టింటికి పోయింది. ఇగ తిరిగి రాలే. గా పెనిమిటి గూడ యెతికియెతికి యేసారి ఊకున్నడు. గట్లనే 48 ఏండ్లు గడిసిపోయినయి. కట్ శేత్తే, ఇగీమద్దెల ఒగామె గా లలన్ ఇంటి ముందర పోలీసులతోటి నిలబడింది.! గిది మా ఇల్లేనంది. గాయినె ఎవలనువ్వని అడిగితే, నేనే నీ పెండ్లాన్నంది. ఎట్ల నమ్మాల్నంటే, ఎన్కట యేసుకున్న పచ్చబొట్టును సూపింది. గామె నిర్మలాదేవేనని గుర్తు పట్టిండు. ఎదురు సూస్తున్నందుకు బాగనే ఎదురైందనుకున్నడు.
అసలేం జరిగిందంటే, ఇద్దరి పిల్లగాండ్లతోటి ఇంట్లకెల్లిపోయిన గామె పుట్టింటికి పోయింది. పుట్టింటోల్లతోటి పడక, నాగపూర్ పోయింది. గాడనే ఉండిపోయింది. ఇగిప్పుడు ఓ పాలి పెనిమిటిని సూడాలనిపించిందంట. గంతే. గా జంటే కాదుల్లా… గవాల్లను సూసినోల్లు గూడ తెగ మురిసిపోతాండ్రట. !

