భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై కీలక సూచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై వారు కీలక సూచనలు చేశారు. భూ భారతి చట్టంపై కలెక్టర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జిల్లాలోని ప్రతి మండలంలో నిర్వహించే అవగాహన సదస్సుల్లో కలెక్టర్లు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ప్రజలకు చట్ట వివరాలు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రతి నియోజకవర్గంలో 3500 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, తుది జాబితా జిల్లాలోని ఇంచార్జి మంత్రి ఆమోదం అనంతరం ప్రకటించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, నీటిపారుదల శాఖతో సమన్వయం చేస్తూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

