మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదని కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. మేము కక్ష కడితే చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారన్నారు. అలాగే డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారన్నారు.16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదన్నారు. లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారని తనను జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసుకున్నారు. కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారన్నారు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా అన్నారు. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడని చెప్పారు. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా అంటూ ప్రశ్నించారు. అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని, నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారన్నారు. కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించామని చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శిస్తున్నాను అన్నారు. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించానని చెప్పారు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోందన్నారు.

