ప్రజల కోసం పనిచేయాలని సూచన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని ఫిరోజ్ రోడ్డులో ఉన్న తన నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రజల సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఈ సమావేశంలో ఆతిశీతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని తెలిపారు. మార్చి 8 నాటికి మహిళలకు నెలకు రూ. 2500 చెల్లించేలా, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించేలా, ప్రజలకు ఇతర సౌకర్యాలు కల్పించేలా ఆప్ కృషి చేస్తుందని వెల్లడించారు. గత 10 ఏళ్లలో ఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత సేవలు కొనసాగేలా ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆప్ శాసనసభాపక్ష నేత ఎంపికపై నిర్ణయం తదుపరి సమావేశంలో తీసుకుంటామని తెలిపారు.

