ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణు సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నిన్న (ఫిబ్రవరి 4) నమోదైంది. తొట్టెంపూడి వేణు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబానికి చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థలో ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ ను తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (THDC) ద్వారా దక్కించుకుంది.
ఈ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్‌కాంట్రాక్ట్‌గా తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ప్రాజెక్టు నుంచి తప్పుకోగా, 2002లో రిత్విక్ సంస్థ పనులు చేపట్టింది. అయితే, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, THDC మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టులో కేసు నడిచింది. ఈ నేపథ్యంలో తొట్టెంపూడి వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు.
దీంతో రిత్విక్ సంస్థ ఎండీ రవికృష్ణ, ఒప్పంద ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నాంపల్లి రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు, హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

