భారతదేశ చరిత్రలో మధ్య యుగాల దశ ఎంతో కీలకమైనది. దీనిని చీకటి యుగం అని కూడా అంటారు. ఈ కాలంలో అభివృద్ధి స్తంభించిపోయి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం పూర్తిగా నిలిచిపోయిందని చరిత్రకారులు మరియు పండితులు చెబుతుంటారు. కానీ ఇది పూర్తి సత్యమని భావించలేము. ఈ కాలంలో ఈ కాలంలో పాక్షికంగా సామాజికంగానూ మరియు సాంస్కృతికంగానూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

మధ్యయుగ భారతదేశాన్ని మనం మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది తొలి మధ్యయగం. దీని కాలం క్రీ.శ. 750 నుండి 1200 వరకు. ఈ కాలంలో అనేక రాజపుత్ర రాజ్యాలు ఆవిర్భవించి భారతదేశాన్ని పరిపాలించాయి. ముఖ్యంగా సుమారు 36 రాజపుత్ర రాజ్యాలు మరియు రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు వంటి రాజపుత్ర రాజ్యాలు భారతదేశ ఉపఖండాన్ని పరిపాలించాయి.
తొలిమధ్యయుగం చివరి దశలో అనగా 12వ శతాబ్దం చివర్లో భారతదేశంపై తొలిసారిగా ముస్లిం దండయాత్రలు జరిగి మహమ్మద్ బిన్ ఖాసిం మహమ్మద్ ఘజిని మహమ్మద్ ఘోరీ వంటి ముస్లిం రాజులు భారతదేశంపై దండయాత్రలు చేసి భారతదేశ సంపదను కొల్లగొట్టారు.
రెండవది మద్యమ మధ్యయుగం. దీని కాలం క్రీ.శ.1200 నుండి 1500 వరకు అని చెప్పవచ్చు. ఈ కాలంలో ఢిల్లీ సుల్తానులు భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి ముస్లిం సామ్రాజ్యంగా మార్చుకొని సుమారు 320 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించారు. ఢిల్లీ సుల్తానులు ముఖ్యంగా బానిస వంశము ఖిల్జీ వంశము తుగ్లక్ వంశము సయ్యద్ వంశము లోడి వంశముగా చెప్పవచ్చు.
చివరి మధ్యయుగ కాలంలో అనగా సుమారు క్రీ.శ.1500 నుండి 1700 వరకు మొఘలుల ఆగమనం జరిగి భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి సుమారు 200 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పాలించారు. క్రీ.శ. 1700 తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తులు బలహీనులుగా పరిగణించబడ్డారు.
తొలిమధ్యయుగంలో వెలసిన రాజ్యాలు
భారతదేశంలో మరోసారి రాజకీయ అనైక్యత చోటుచేసుకుని అనేక రాజ్యాలు రాజకీయ ఐక్యతను దెబ్బతీసాయి. ఉత్తర భారత దేశంలో సుమారు 36 రాజపుత్ర రాజ్యాలు వెలిశాయి. తూర్పు భారతదేశంలో అనగా బెంగాల్ బీహార్ ప్రాంతాన్ని పాల వంశము మరియు సేన వంశము పరిపాలించాయి. దక్కన్ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు ఆ తరువాత కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు. దక్షిణ భారతదేశాన్ని బలమైన చోళ సామ్రాజ్యం పరిపాలించింది.
ఉత్తర భారత దేశంలో రాజపుత్ర రాజ్యాలు
ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డ 36 రాజపుత్ర రాజ్యాల్లో ముఖ్యంగా మనం ఆరు రాజ్యాల గురించి చర్చిస్తాము. అవి 1. ప్రతిహారులు, 2. పరమారులు, 3. సోలంకులు, 4. చందేలులు, 5. చౌహానులు, 6. గహద్వాలులు.
1. ప్రతిహారులు
వీరు మధ్య ఆసియా ప్రాంతం నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడిన ఘార్జర తెగకు చెందినవారు. ప్రారంభంలో వీరు ద్వార పాలకులుగా పని చేయడం వలన వీరిని ప్రతిహారులు అంటారు. వీరు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని కనోజ్ ను రాజధానిగా చేసుకుని ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఈ వంశంలో మిహిరబోజుడు అత్యంత సుప్రసిద్ధుడు. అరబ్ యాత్రికుడైన సులేమాన్ ఇతని రాజ్యాన్ని పర్యటించి ఇతను ఒక గొప్ప చక్రవర్తి అని కీర్తించాడు. ఇతని తర్వాత మహేంద్ర పాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని ఆస్థానంలోనే సుప్రసిద్ధ సంస్కృత కవి రాజశేఖరుడు జీవించాడు. ఈ రాజశేఖరుడే కర్పూర మంజరి, కావ్య మీమాంశ, భువన కోశము, హరివిలాసము, విద్దసాలభంజిక మొదలగు రచనలు చేశాడు. ఇతని తర్వాత రాజ్యపాలుడు రాజ్యానికి వచ్చాడు. 11వ శతాబ్దంలో మహమ్మద్ ఘజిని కనోజ్ పై దండెత్తగా రాజ్యపాలుడు యుద్ధం చేయకుండా పారిపోయాడు.
2. పరమారులు
వీరినే ‘పవార్’ లు అని కూడా అంటారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వ ప్రాంతాన్ని వీరు పరిపాలించారు. ఉపేంద్రుడిని ఈ రాజ్య స్థాపకుడిగా చెప్పవచ్చు. ఈ వంశంలో పరమార బోజుడు అందరి కంటే గొప్పవాడు. ఇతను కవిరాజ అనే బిరుదును తీసుకొని సంస్కృతంలో 24 కావ్యాలు రచించాడు. ఇతను భోజ్ పూర్ అనే నూతన నగరాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ భోజ్ పూర్ నగరమే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ గా కొనసాగుతుంది.
3. సోలంకులు
ఉత్తర భారత దేశాన్ని పరిపాలించిన ప్రతిహారులకు సామంతులుగా ఉండి తర్వాత కాలంలో స్వతంత్రులై గుజరాత్ లోని పాటక్ ప్రాంతాన్ని మూడు శతాబ్దాలకు పైగా పరిపాలించారు. మూల రాజును ఈ రాజ్య స్థాపకుడిగా చెప్పవచ్చు. సోలంకి వంశంలో జయసింహ సిద్ధరాజ అందరికంటే గొప్పవాడు. ఇతను పరమారులను ఓడించి అవంతినాధ అనే బిరుదును తీసుకున్నాడు. ఇతని ఆస్థానంలో హేమచంద్రుడు అనే సుప్రసిద్ధ జైన కవి ఉండేవాడు. ఈ హేమచంద్రుడు నేమినాథచరిత్ర, సిద్ధ హేమచంద్ర, త్రిషష్ఠిశలకపురుష, కుమారపాలచరిత, పరిశిష్టపర్వన్ అనే రచనలు చేశాడు.
సోలంకుల కాలంలో గుజరాత్ లో అత్యంత సుప్రసిద్ధమైన కట్టడాలు నిర్మించబడ్డాయి. అందులో రాణి కీ వావ్ ముఖ్యమైనది. 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి పాటక్ లో అత్యంత సుందరమైన మెట్ల బావి నిర్మింపచేసింది. UNESCO ఈ కట్టడాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. 100 రూపాయల నోటుపైన ఈ కట్టడం ముద్రించపడింది.
4. చందేలులు
ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని బుందేల్ఖండ్ రాజధానిగా వీరు పరిపాలించారు. నన్నుక వీరి రాజ్య స్థాపకుడిగా చెప్పవచ్చు. వీరు శిల్పకలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తర భారత దేశంలో లభ్యమయ్యే అత్యంత సుందరమైన, సుప్రసిద్ధమైన శిల్పకళలు వీరివే. ఇందులో ఖజరహో అద్భుత దేవాలయ నిర్మాణాలు వీరు చేసినవే. 11వ శతాబ్దంలో శిఖర శైలిలో నిర్మింపబడిన దాదాపు 85 దేవాలయాలలో నేటికీ 25 ఆలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఈ ఆలయాలను శృంగార భరితమైన శిల్పాలతో అలంకరించారు. 1838లో టి.ఎస్.బర్డ్ అనే ఆంగ్లేయ పండితుడు ఖజరహో ఆలయాలను కనుగొన్నాడు.
5. చౌహానులు
వీరు కూడా ప్రారంభంలో ప్రతిహారులకు సామంతులుగా ఉండి తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. వాసుదేవుడిని ఈ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. పృధ్విరాజ్ చౌహాన్-III ను ఈ వంశంలో అత్యంత గొప్పవాడిగా పరిగణిస్తారు. ఇతను పర్షియన్ గ్రంథాల్లో రాయ్ పితురా గా పిలువబడ్డాడు. ఇతని ఆస్థానంలో చాంద్ బర్దాయ్ కవి ఉండేవాడు. ఇతను హిందీలో తొలి కావ్యంగా గుర్తించబడిన పృధ్వి రాజా రాసో ను రచించాడు. ఇది పృధ్విరాజ్-III రాకుమార్తె సంయుక్తను ఏ విధంగా ప్రేమించి వివాహం చేసుకున్నాడని తెలియజేసే రచన. ఈ పృధ్వీరాజ్-III మహమ్మద్ ఘోరీ తో రెండు యుద్ధాలు చేశాడు. 1) 1191లో మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీని ఓడించి తరిమికొట్టాడు. (ఈ తరైన్ ప్రస్తుత హర్యనాలో ఉంది.), 2) 1192 లో ఘోరీ మరోసారి దండెత్తగా ఈ యుద్ధంలో పృధ్వీరాజ్-III ఓడిపోయి అంతం చేయబడ్డాడు. ఈ యుద్ధమే ముస్లిం పాలనకు భారతదేశంలో పునాదులు వేసిందిగా చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉంటారు.
6. గహద్వాలులు
ప్రారంభంలో వీరు దక్కన్ ను పాలించిన రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేశారు. తరువాత స్వతంత్రాన్ని ప్రకటించుకుని కనోజ్ ను మొదటి రాజధానిగా మరియు కాశీ పట్టణాన్ని రెండవ రాజధానిగా చేసుకున్నారు. యశోవిగ్రహను ఈ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. గహద్వాల వంశంలో జయచంద్ర అత్యంత ప్రముఖుడు. ఇతని ఆస్థానకవే శ్రీహర్షుడు. ఇతను నైషదచరిత అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. 1194లో మహమ్మద్ ఘోరీ ఈ రాజ్యంపై దండెత్తగా చాందవార్ యుద్ధంలో జయచంద్ర హత్యగావింపబడడంతో గహద్వాల వంశం అంతమైంది.

