అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడిన బండి సంజయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సినిమా రంగంపై రేవంత్ రెడ్డి తీరు తెలుగు ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా ఉందని విమర్శించారు.‘‘సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారని, బాధిత కుటుంబానికి ప్రజలందరూ బాసటగా నిలవాలని కోరారని పేర్కొన్నారు. అలాగే, ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ ప్రజలు పూజలు చేస్తున్నారని చెప్పారు.
గతంలో ముగిసిన సమస్యను మళ్లీ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ఎంఐఎం సభ్యుడితో కలిసి ప్రశ్న అడిగించడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఈ చర్య కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారమే సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర అన్నారు. పవిత్రమైన అసెంబ్లీ వేదికగా ఇలాంటి రాజకీయాలు నడపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.ఎంఐఎం పార్టీని ఐరన్ లెగ్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరిన ఈ పార్టీ ఆ పార్టీని నాశనం చేసిందన్నారు. ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుందని హెచ్చరించారు.
గురుకుల పాఠశాలలలో విషాహారం తిని విద్యార్థులు చనిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం & సీఎం స్పందించలేదని విమర్శించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తినడం, పాముకాట్లతో విద్యార్థుల ప్రాణాలు పోవడం విషాదకరమని, అయితే ఈ సమస్యలపై ప్రభుత్వం ఏ సమయంలోనూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన దుర్గతి కాంగ్రెస్ పార్టీకీ తప్పదని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అనేక సమస్యలకు కారణమని మండిపడ్డారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీలో అసత్య కథలు అల్లడం దారుణమని పేర్కొన్నారు. సినీ రంగానికి వ్యతిరేకంగా ప్రణాళికబద్ధంగా కుట్రలు పన్ని, ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించబోరని అన్నారు.ప్రజల సమస్యలపై సమర్ధవంతంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టించడం దారుణమని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

