మంజూరై 18నెలలైనా ముహూర్తం కుదరలే
పంచాయతీలే తప్ప పునాదిరాయి పడలే
పూర్తవ్వాల్సిన స్కూల్ ఇంకా మొదలే కాలే
కొడకండ్లలో పదో రోజుకు చేరిన దీక్షలు
పాలకుర్తిలో ప్రారంభమవుతోన్న నిరసనలు
నాయకుల పంతమా.. విద్యార్థుల భవిష్యత్తా?
నేతల పట్టింపులు, పంతాలతో ప్రమాదంలో ప్రాజెక్టు
పాలకుర్తి నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఇప్పటికే పూర్తి కావాల్సిన స్కూల్ ఎందుకు మొదలే కాలేదు? విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన విద్యా ప్రాజెక్టు రెండు మండలాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఎందుకు మారింది? నాయకులు తమ అంటే తమ ప్రాంతాల్లోనే పాఠశాల ఏర్పాటు చేయాలంటూ పట్టుబడుతుండటమే కారణమా? మెట్టు దిగని, బెట్టు వీడని, ఈ పట్టువిడుపుల్లో అసలు లక్ష్యమే మాయమవుతోందా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించి, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు అయ్యాయి. అందులో పాలకుర్తికి కూడా తేదీ: 27-05-2025న ఒక స్కూల్ మంజూరైంది. దాన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో పాలకుర్తి కేంద్రంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, పాలకుర్తి, మండలంలో ఆ స్కూల్ కు కావాల్సిన ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదని కొందరు అధికార పార్టీ నేతలే దుష్ప్రచారం చేశారు. పైగా వాళ్ళు ఎమ్మెల్యేకు సరైన సమాచారం అందించలేదనే విమర్శులున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాఠశాలను కొడకండ్ల మండలానికి తరలించే ప్రాథమిక ఆలోచనలు జరిగాయి. దీంతో కొడకండ్లలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ అక్కడి నేతల్లో, ప్రజల్లో బలపడింది. కొడకండ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంపై కలెక్టర్‌ను కలిసి తమ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, పాఠశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎక్కడ ఉంది? అందుబాటులో ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో రావాలని కలెక్టర్ వారికి సూచించారు.
ఇదే సమయంలో కొడకండ్లలోని అధికార పార్టీ నేతలు తమ గ్రామాల్లోనే ఆ స్కూల్ ని ఏర్పాటు చేయాలని పట్టపట్టారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. స్థల ఎంపికపై స్పష్టత రాకపోగా, సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ఇదే సమయంలో పాలకుర్తి మండల అధికార పార్టీ నాయకులు కూడా తమ ప్రాంతంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతూ స్థల పరిశీలన చేపట్టారు. రెండు మండలాల మధ్య పోటీ మరింత పెరిగింది. తర్వాత ఏమైందో కానీ, కొడకండ్లలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి, ఐక్యవేదికగా రూపొంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం ఉద్యమ బాట పట్టడం కీలక పరిణామంగా మారింది. పది రోజులుగా స్థానికంగా నిరసనలు, డిమాండ్లు, దీక్షలు మరింత ఊపందుకున్నాయి.
ఇక పాలకుర్తిలోనూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మరో ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. దీంతో ఒకే నియోజకవర్గంలో ఒక విద్యా సంస్థ కోసం రెండు మండలాల మధ్య పోటీ సమస్యాత్మకంగా మారింది. మరింత గందరగోళం నెలకొంది.
నాయకుల పంతమా.. విద్యార్థుల భవిష్యత్తా?
వాస్తవానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఒకే ప్రాంగణంలో అందించడం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం. అలాంటి కీలకమైన విద్యా ప్రాజెక్టు విషయంలో స్థానిక నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలు, ప్రాంతీయ పట్టింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది? రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఏది? భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగినా సరిపడా వసతులు కల్పించగలమా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.
చివరకు సాధించేదేమిటి?
ఒకవైపు కొడకండ్లలో ఉద్యమం కొనసాగుతుండగా, మరోవైపు పాలకుర్తిలోనూ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతుండటంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. రెండు మండలాల మధ్య వివాదం ఇలాగే కొనసాగితే మంజూరైన పాఠశాల ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ విద్యా సంస్థ ఎక్కడ ఏర్పాటు కానుంది? ప్రభుత్వం ఏ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వనుంది? లేక వివాదం కారణంగా ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారనుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రాంతాల మధ్య పోటీ కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని, నాయకులు పట్టింపులు పక్కనపెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాలని ప్రజలు కోరుతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం పోరాటం జరగాలి కానీ, ఆ పోరాటంలో విద్యార్థుల భవిష్యత్తు బలికాకూడదన్నది ఎవరూ మరచిపోకూడదు.
….
కొడకండ్లలో 9వ రోజుకు దీక్షలు!

కొడకండ్ల మండల కేంద్రంలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వినూత్నంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ పొన్నం వెంకన్న మాట్లాడుతూ.. కొడకండ్లను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పాఠశాలను మరో గ్రామానికి తరలిస్తారనే ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోనే పాఠశాలను ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, యువకులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
…..
పాలకుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి!
సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని యువజన ఆర్యవైశ్య సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు గజ్జి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల ఏర్పాటు వల్ల పాలకుర్తితో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నియోజకవర్గ విద్యారంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే వెంటనే స్పందించి పాఠశాల నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కోసం సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గజ్జి సంతోష్ కుమార్ హెచ్చరించారు. పాలకుర్తిలోనే పాఠశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

