ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్, పైన బట్టలతోటి గట్టిగ కుట్టుతరాయె. మరి గా సోఫాలను శుభ్రం శేయాల్నంటే తల పానం తోకకొత్తది. ఉత్కేటియి కాదాయె? శీపిర్లు, బట్టలతోటి ఎంత దులిపినా పోదాయె. మరి గిదీనికి ఓ తల్లి మంచి ఇకమతు కనిపెట్టింది.

ఒక బట్టను తీసుకోవాలె. గీ పోటువల సూపినట్లు, గదాన్ని బట్టల సబ్బు నీళ్ళు, కమ్మగ వాసనొచ్చే కంఫర్ట్ లు పోసిన గిన్నెల ముంచాలె. ఇగ గా ముంచిన గుడ్డను, పైన పట్టుకునే కాడ ఉండి, వెడల్పున్న మూతకు సుట్టాలె. ఇగ గా కాడను పట్టుకొని, గ దాన్ని సోఫాల మీద రాయాలె. గట్ల రుద్దుతాంటే.. గా సోఫాకు పట్టిన అట్ట కట్టిన మట్టంతా గా గిన్నె మూత బట్టకు అంటుకుంటాంటది. గా సోఫా శుభ్రంగా అయితాంటది. ఎట్లుంది? గీ యికమతు… మీరూ శేసి సూడుండ్లి మరి.

