ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది? నిజంగా నిజముల్లా…! గాలి మేడలు కూడా వచ్చనియి. కావాల్నంటే నేను సూపుత పదండ్రి.!

ఇండ్లను పక్కా ఇండ్లు, కచ్చా ఇండ్లని రెండు రకాలుగా ఏరు శేయొచ్చు. కనీ గవాట్ల గూడ అనేక రకాలుగా ఉంటయి. సిమెంట్, ఇటుకలు, కాంక్రీట్, ఉక్కు ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, బంగ్లాలు, విల్లాలు, పెంట్‌హౌస్‌లు, ఫాం హౌస్ లు, చాల్‌లు, స్టిల్ట్ హౌస్‌లు, హౌస్‌బోట్లు, డేరాలు, గుడిసెలు, పెంకుటిండ్లు లెక్క శేంతాడు లెక్క బాగనే పెరుగుతాంది కదా? వీటికి భిన్నమైన ఇండ్లే గీ గాలి మేడలు.
గాలి మెత్త లెక్కనే ఓ సంచిల పడ్తయి. గివీటిని దానికి సరిపోయే ఖాళీ జాగల పెట్టి, ఓ మీట నొక్కితే గదే గాలి నింపుకుని ఇల్లు లెక్కైతది. ఇగ గండ్ల మంచిగుండొచ్చు. వద్దనుకుంటే గా గాలి తీసి, మెత్తలెక్కనే మలుసుకుని సంచిల పెట్టుకోవాలె. దూరప్రాతాలకు తిరిగి రావడానికి పోతే గియి మంచగుంటయట? మరి మీరూ ఆలోసించుండ్రి.!

