డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైట్ హౌస్ అధికారిక వెబ్‌సైట్ కొత్త రూపులోకి మారింది. వెబ్‌సైట్‌పై “అమెరికా ఈజ్ బ్యాక్” అనే బ్యానర్‌తో పాటు ట్రంప్ ఫోటోను జత చేసి ప్రత్యేక డిజైన్ చేయబడింది. ట్రంప్ సంతకం చేసిన సందేశం కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు, ఇందులో “నేను ప్రతి శ్వాసతో మీ కోసం పోరాడుతూనే ఉంటాను. బలమైన, సురక్షితమైన, సంపన్నమైన అమెరికాను నిర్మించే వరకు విశ్రమించను. ఇది అమెరికా స్వర్ణయుగం అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
కొత్త లుక్‌తో వెబ్‌సైట్‌తో పాటు ‘ఎక్స్’, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్లలో కూడా మార్పులు కనిపించాయి. ట్రంప్ ప్రెసిడెంట్‌గా పొందిన విజయాలు, పన్ను మినహాయింపులు, మధ్యతరగతి వారికి ఉపాధి కల్పన వంటి అంశాలను కూడా వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు.
ట్రంప్ వెబ్‌సైట్‌లో అమెరికాను ఇతర దేశాల యుద్ధాల నుండి దూరంగా ఉంచడం, సైనిక సంసిద్ధతను మెరుగుపరచడం వంటి విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్‌ల పరిచయం కూడా అందులో ఉంది. “అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైంది” అని ట్రంప్ తన సందేశంలో తెలిపారు.

