మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నా, రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేదు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడం, ప్రాంతీయ పార్టీల ఆందోళనలకు పరిష్కారం చూపడం ద్వారానే బిల్లు ఆమోదం సాధ్యమవుతుంది. కేబినెట్ ఆమోదం తొలి అడుగు మాత్రమే. అసలైన పరీక్ష పార్లమెంటులోమిగిలే ఉంది! మరి ఈ చిక్కులను ప్రభుత్వం ఏ విధంగా అదిగమిస్తుంది? అడ్డదారుల్లో ఆమోదం పొందుతుందా? ఏ భరోసాతో మరోసారి కేబినెట్ బిల్లులకు ఆమోదం తెలిపింది? మోదీ, షాల ప్లానేంటి?
మార్గం – అడుగు, ఎడిటోరియల్
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన తాజా రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మరోసారి దేశ రాజకీయాల్లో వాటిపై చర్చ మొదలైంది. 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఆచరణలోకి రావాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. అయితే గతంలో ఇదే అంశంపై ప్రభుత్వం ఎదుర్కొన్న పరాభవం నేపథ్యంలో ఈసారి బిల్లు గట్టెక్కడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత వైఫల్యమే గుణపాఠంగా ప్రభుత్వం తాజాగా అడుగులు వేస్తోందా? 2026 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేక వీగిపోయింది. అప్పట్లో ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యుల్లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేశారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ 352 ఓట్లు కాగా, ప్రభుత్వం 54 ఓట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో అనుబంధ డీలిమిటేషన్ బిల్లులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది.
ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం తాజాగా మార్పులతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50% పెంచడం, రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించడం ఇందులో ప్రధానాంశాలు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలను తొలగించగలమని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభలో మూడు స్థానాల ఖాళీలతో సభ్యుల సంఖ్య 540. అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణకు 360 ఓట్లు అవసరం. ఎన్డీఏ బలం 320. ఇందులో బీజేపీకి 241, మిత్రపక్షాలకు 79 స్థానాలున్నాయి. అంటే మరో 40 మంది మద్దతు అవసరం.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకం కానుంది. డీఎంకేకు 22, శరద్ పవార్ ఎన్సీపీకి 8, వైఎస్సార్‌సీపీకి 4 మంది లోక్‌సభ సభ్యులున్నారు. ఎన్సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించడం ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చింది. ఈ మూడు పార్టీల మద్దతు లభించినా ఎన్డీఏ బలం 354కే చేరుతుంది. ఇంకా ఆరు ఓట్లు అవసరమవుతాయి. మరి ఈ సంఖ్యను సాధించడమెలా?
రాజ్యసభ సభ్యుల సంఖ్య 250 కాగా, 6 ఖాళీలు పోను ప్రభావిత సభ్యుల సంఖ్య 244. అందరూ ఓటేస్తే బిల్లు నెగ్గడానికి 164 ఓట్లు అవసరం. ఎన్డీఏకు 154కు పైగా సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడా కూడా ఇంకా అదనపు మద్దతు తప్పనిసరి.
బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం మూడు మార్గాలను అనుసరించవచ్చు. మొదటిది ప్రాంతీయ పార్టీలతో చర్చించి మద్దతు కూడగట్టడం. రెండోది బిల్లులో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి రాజ్యాంగపరమైన భరోసా కల్పించి దక్షిణాది పార్టీల అభ్యంతరాలను తగ్గించడం. మూడోది మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ వివాదం నుంచి వేరు చేసి, వాటి అమలుకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం.
అయితే, గైర్హాజరు, ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల అవసరమైన మూడింట రెండొంతుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తం సభ్యత్వంలో మెజారిటీ అనే నిబంధన కూడా వర్తిస్తుందని గుర్తించాలి.
మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నా, రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేదు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడం, ప్రాంతీయ పార్టీల ఆందోళనలకు పరిష్కారం చూపడం ద్వారానే బిల్లు ఆమోదం సాధ్యమవుతుంది. కేబినెట్ ఆమోదం తొలి అడుగు మాత్రమే. అసలైన పరీక్ష పార్లమెంటులోనే మిగిలిఉంది!. మరి ఈ చిక్కులను ప్రభుత్వం ఏవిధంగా అదిగమిస్తుంది? అడ్డదారుల్లో ఆమోదం పొందుతుందా? ఏ ధైర్యంతో ప్రస్తుతం మరోసారి కేబినెట్ బిల్లులకు ఆమోదం తెలిపింది? మోదీ, షాల ప్లానేంటి? కొద్ది రోజుల్లో తేలనుంది?

