సామాజిక మార్పు తీసుకొచ్చాం, ఆర్థిక మార్పుకు ఇంకా సమయం అవసరం
– సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సామాజిక మార్పులు తీసుకొచ్చామని, ఆర్థిక మార్పులకు కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల పరిపాలన వ్యవస్థ భ్రష్టుపట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ప్రతీ నెల మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే, ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని వెల్లడించారు.
ప్రతి నెలకు కనీసం రూ. 22,500 కోట్ల అవసరం ఉన్నప్పటికీ, రూ. 18,500 కోట్ల మాత్రమే ఆదాయం వస్తోందని, ఇంకా రూ. 4,000 కోట్ల లోటు ఉందని తెలిపారు. అందులోనూ ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 6,500 కోట్లు, అప్పుల చెల్లింపులకు రూ. 6,500 కోట్లు, మిగిలిన రూ. 5,500 కోట్లు సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్ర అవసరాలు పూర్తి చేయాలంటే నెలకు రూ. 30 వేల కోట్లు అవసరం ఉంటుందని, ఈ లక్ష్య సాధనకు ఉద్యోగుల సహకారం కీలకమని సీఎం సూచించారు.
ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని, నిరసనలు, ధర్నాలకు తావులేకుండా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని వివరించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై ప్రభుత్వానికి కొన్ని నిబంధనలతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎంసలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

