Friday, March 13, 2026
24.7 C
Hyderabad

గజిబిజి పాటల గిజిగాడు!|ANDE SRI|TELANGANA

పాటను ప్రజలు తమ అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు కాబట్టే పాటను పట్టుకుని, పాడుకుని, వేలాడుకుని అనేక మంది కవులు, రచయితలు ఆనాటి నుంచి నేటికీ ఉన్నారు. ఉంటారు. పాటకు పనికి మాదిరిగానే, పాటకు ఆ పాటను రాసే రచయితకూ విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే పాట సముద్రమైతే, అందులో కలిసే ఏరులు, సెలయేరులు, కాలువలు, పిల్లకాలువలు ఈ కవులు, వారు రాసిన ఆ పాటలూ. అందులోకి వచ్చి కలిసిన ‘సహజ’ జలపాతం అందెశ్రీ. అక్షరాభ్యాసం లేని ఆ జలపాతం వల్లెంక పిట్ట వలె అతి సహజంగా అనతి కాలంలోనే గిజిబిజిగా పిచ్చుక గూడు అల్లుకుంది. సినీ జగత్తులో ‘నను సూడం’టూ నిలిచింది. ఆ గూడు ఈ ప్రపంచం, సినీ సమాజమైతే, పాటలతో ఆ గూడల్లుకున్న గిజిగాడు అందెశ్రీ!

“మాయమైపోతున్న! మనిషన్న వాడిని”, మానవత్వాన్ని వెతుక్కుంటూ సాగిన అందెశ్రీ అంతరంగమిది. మనిషన్న వాడి మనసు దొంతరలలో దాగిన అపార అనుభవసారమిది.
‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీనారాయణ 20 ఏళ్ళ క్రితం వరంగల్ లో అందె శ్రీతో మాట-ముచ్చట యధాతథంగా… ‘అడుగు’ ప్రత్యేకం

గజిబిజి పాటల గిజిగాడు!
-ప్రకృతి ఒడిలో ‘అందె’ల సందడి!!
-అందెశ్రీ ‘సహజ’ మువ్వల ఝరిలో తడిసిన పాటల సవ్వడి
-ఇరవై ఏళ్ళ క్రితం అందె శ్రీతో మార్గం మాట-ముచ్చట

ఎవరికీ తల వంచను! పాటకు తలవంపులు తేను!! *’అడుగు’తో పంచుకున్న అందెశ్రీ అంతరంగం

నేను ఎవరికీ తల వంచను…నా బతుకు బాటైన పాటకు ఎన్నటికీ తలవంపులు రానివ్వను. అందుకే పాటను ప్రపంచం ముంగిట్లోకి తేవాలని ఉంది. నాకే కాదు నను గన్న నేలకు కూడా పేరు తేవాలనే ఉంది. ‘అడుగు’ కోసం ఆయన్ని కలిసినప్పుడు ఆయన స్పందనలివి. సాహిత్య లోకంలో ఇంకా చిన్న పిల్లాడినే అన్న అందెశ్రీ “లోకం నా ఇల్లు..జనమంతా నా వాళ్ళు… ప్రగల్బాలు మార్చుకో…ప్రజల నుంచి నేర్చుకో’ మంటాడు. చరిత్రకు తలమానికమైన ప్రజలకు విధేయంగా బతుకని జీవితం జీవితమే కాదంటాడు.

‘నా అన్నదేదీ లేదు. నేను అనుభవించేది నా ముందు తరాలది… నేను సంపాదించేది నా ముందు పరంపరది. అంటాడు. నేను ఎవరికీ పోటీ కాదు… నాకు ఎవరూ సాటి రారన్న అతిశయోక్తి కూడా ఆయనకేమీ లేదు. నాకున్నవన్నీ…నాకు వచ్చినవన్నీ, ఆపాదించబడినవన్నీ ప్రజలిచ్చినవే… అవన్నీ వాళ్ళకే నివేదిస్తానంటాడు. అదే తన జీవిత లక్ష్యం’ అంటాడు అందెశ్రీ.

-✍ డా. మార్గం లక్ష్మీనారాయణ

పాటకు సాకీ, పల్లవి, చరణాలు మాత్రమే కాదు పాటకు రాగం, గానం, తాళం మాత్రమే లేవు. పాటకు శాశ్వతత్వం ఉంది. పాటకు శాసించే గుణం ఉంది. పాటకు ప్రేరణ ఉంది. ప్రేరేపించే లక్షణం ఉంది. అందుకే అది గద్దరన్న నోట పలికి ‘జన నాట్య’మైంది. గూడ అంజన్న చేత ‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా’ అని ఎదురించింది. గోరటి వెంకన్న నోట జాలువారి ‘పల్లె కన్నీరొలికింది’. సుద్దాల అశోక్ తేజ కలంతో ‘టప టప టపమని రాలి సెమట సుక్కైం’ది. జయరాజు వెంట ‘వాన సినుకైం’ది. బిక్షపతి నోట ‘నిన్ను విడిచి ఉండలేనమ్మా’ అనిపించింది.

అందెశ్రీ రాసిన పొటలు కొన్ని.

– మాయమై పోతున్నడమ్మా! మనిషన్న వాడు (ఎర్ర సముద్రం)
– కొమ్మ చెక్కితే బొమ్మరా! కొలిచి మొక్కితే అమ్మరా!! (వేగు చుక్కలు)
-సూడా సక్కని తల్లీ సుక్కల్లో జాబిల్లీ (ఊరు నమదిరా!)
-ఎల్లిపోతున్నవా తల్లీ. నేల మసకబారిన జాబిల్లీ! (గంగ)
-ఆడ బతుకే పాడు బతుకని ఏడుస్తవెందుకే చెల్లెలా (అధిపతి)
-సినుకమ్మా! వాన సినుకమ్మా!!
-నేడు సిన్నబోయింది చూడూ బతుకమ్మా! (బతుకమ్మ)
-రండి కదలి రండి పోరు దండు పిలుస్తోంది (బతుకమ్మ)
-ఎంత గొప్ప వింత చూడమ్మా? ఈ సృష్టిలో పక్షికెంతా శక్తి ఉందమ్మా? (పిచ్చుక గూడుగా అందెశ్రీ గజిబిజి అల్లిక)
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ మాతృగీతం
-పల్లెనీకు వందనములమ్మో
– గలగల గజ్జెలబండి
-జన జాతరలో మన గీతం

పాటను ప్రజలు తమ అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు కాబట్టే పాటను పట్టుకుని, పాడుకుని, వేలాడుకుని అనేక మంది కవులు, రచయితలు ఆనాటి నుంచి నేటికీ ఉన్నారు. ఉంటారు. పాటకు పనికి మాదిరిగానే, పాటకు ఆ పాటను రాసే రచయితకూ విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే పాట సముద్రమైతే, అందులో కలిసే ఏరులు, సెలయేరులు, కాలువలు, పిల్లకాలువలు ఈ కవులు, వారు రాసిన ఆ పాటలూ. అందులోకి వచ్చి కలిసిన ‘సహజ’ జలపాతం అందెశ్రీ. అక్షరాభ్యాసం లేని ఆ జలపాతం వల్లెంక పిట్ట వలె అతి సహజంగా అనతి కాలంలోనే గిజిబిజిగా పిచ్చుక గూడు అల్లుకుంది. సినీ జగత్తులో ‘నను సూడం’టూ నిలిచింది. ఆ గూడు ఈ ప్రపంచం, సినీ సమాజమైతే, పాటలతో ఆ గూడల్లుకున్న గిజిగాడు అందెశ్రీ!

‘సూడా సక్కని తల్లీ సుక్కల్లో జాబిల్లీ… నవ్వుల్లో నాగమల్లి…నా పల్లె పాలవెల్లీ…’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా! కొలిచి మొక్కితే అమ్మరా!!’ “మాయమై పోతున్నడమ్మా! మనిషన్న వాడు… ఓఓఓ మచ్చు కైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడూ!” ఈ పాటలు వింటున్నప్పుడు మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది అందెశ్రీ. అందెశ్రీ చదువుకోలేదు. అక్షరాభ్యాసం ఎక్కడా చేయలేదు. పుట్టిన నాటి నుంచి పుట్టెడు కష్టాల్లో పెరిగిండు. ఊరంతా జీతగాడైనాడు. పొట్టు చేత పట్టుకుని వలసపోయిండు. కష్టాల కడగండ్లలోనే పట్నం చేరిండు. ఈ అన్ని సమయాల్లో ఆయనకు పాటే ఆసలైన ఆలంబన అయింది. సరస్వతి ‘సహజం’గానే కటాక్షించింది. అంతే ఆయనిక వెనుతిరిగి చూడలేదు. గంగమ్మ సినిమా కథ రాసినా, బతుకమ్మను ఆవిష్కరించినా ఆయనకే చెల్లింది.

…….

మరచిపోలేని సంఘటనలు

ఊరందిరికీ జీతగాడుగా మా ఊళ్ళోపశువుల కాసిన రోజులు… ఆ ప్రకృతి అందాలు… నిజామాబాద్ లో శంకర్ మహారాజ్ ఆశ్రమ జీవితం. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద మైసూరు దత్త పీఠం రెండుసార్లు స్వర్ణ కంకణాలు తొడిగి, రూ.లక్ష పురస్కారం ఇచ్చిన సందర్భం. కాకతీయ విశ్వవిద్యాలయం చదువురాని నాకు డాక్టరేట్ ప్రకటించినప్పుడు, ఆ గౌరవాన్నందుకున్న సందర్భం. ఈ డాక్టరేట్ ఆవార్డుకు ఆజ్యంపోసి, పురుడుపోసిన సోమనాథ కళా పీఠం పురస్కారం. ఇంకా ఇలాంటివెన్నో… ఎన్నెన్నో…

……

“మాయమైపోతున్న! మనిషన్న వాడిని”, మానవత్వాన్ని వెతుక్కుంటూ సాగిన అందెశ్రీ అంతరంగమిది. మనిషన్న వాడి మనసు దొంతరలలో దాగిన అపార అనుభవసారమిది.

‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీనారాయణ 20 ఏళ్ళ క్రితం వరంగల్ లో అందె శ్రీతో మాట-ముచ్చట యధాతథంగా…

ప్ర:- మీ జీవన ప్రస్థానం గురించి చెప్పండి?

జః- పదేళ్ళపాటు నేను నా ఊరికే జీతగాన్ని… పశువుల కాపరిగా ఊరందరి పశువులను కాసేవాడిని. 1976లో కాలుమీద గడ్డపార పడితే ఆరు నెలలు, కిందనే దేకిన… అనాథగా ఉన్న నాకు నా ఊరే ఇంత అన్నం పెట్టింది. ఆదరించింది. ఆతర్వాత బతుకు దుర్భరమైంది. చావలేను… చస్తూ బతకలేను… ఏం చేయాలో తోచలేదు. అప్పుడే నిజామాబాద్ కు ఉప్పర పనికి మా బావతో వెళ్ళాను. అక్కడా పుట్టెడు కష్టాలు పడి…ఉప్పరి పనితోపాటు కట్టడాలు నేర్చుకున్నట్లే… పాటలు అల్లడం నేర్చుకున్నాను. ఆవిధంగా నేను పుట్టింది ఓరుగల్లు అయినా నాలో పాట పురుడు పోసుకున్నది నిజామాబాద్ జిల్లాలోనే. 1979 దాకా నిజామాబాద్ లోనే శంకర్ మహారాజ్ సన్నిధిలో తట్ట, పార పనీ పాటతోపాటు ఆశ్రమ జీవితం గడిపాను. అదే సమయంలో ఒక అమ్మాయి వెంట పడితే ఆమెను తప్పించుకోవడానికి హైదరాబాద్ నగరానికి పారిపోయి వచ్చాను. పొట్టపోసుకోవడానికి మళ్ళీ అక్కడ నేర్చుకున్న పనే దిక్కయింది. అయితే ఆ అమ్మాయి జీవితమే ఆతర్వాత ‘గంగ’ సినిమా కథ అయింది.

ప్ర : – మీ రచనా ప్రస్థానం ఎలా సాగింది?

జ :- అలా పని చేస్తున్న నాకు అనేక మంది పరిచయాలు ఏర్పడ్డాయి. కానీ ఎవరినీ ఆశించలేదు. యాచించలేదు. బతుకు, చేతికి మూతికి లాగా గడిచింది. అయితే అప్పుడప్పుడు రాసుకున్న పాటలను తాపీ పనిలో అతికష్టంగాత వెనుకేసిన డబ్బులతో 1995లో ‘పాటల పూదోట’ పేరుతో లలిత గీతాల పుస్తకం అచ్చేశాను. ఆతర్వాత ‘అందెల సందడి’ వచన కవిత్వం వేశాను. ఆ పుస్తకానికి ముందుమాటను ప్రఖ్యాత దివంగత జర్నలిస్టు జి.కృష్ణ ముందు మాట రాశారు. అందులో ఆయన “నిన్ను ఏ కవి అని వర్ణించను. అరసం, విరసం వంటి వ్యాఖ్యలతో నిన్ను చూడలేను. నిఖార్సయిన కనివి… చదువురాని వాడి కవిత్వానికి, కవిత్వం రాని వాడు రాస్తున్న ముందుమాట”గా ఆనాడు జి.కృష్ణ పేర్కొన్నారు.

ప్ర:- పాట మీకెలా అబ్బింది? అసలీ ఆలోచన ఎలా వచ్చింది?

జః- బతుకు పోరాటమే నాకు పాటలు నేర్పింది. ప్రకృతి, పల్లెతల్లి, ప్రజలు, లోకమంతా నాకు పాలు లోకమైంది.

ప్ర:- పాటలు రాయడానికి ప్రేరణ ఏమిటి?

జ:- నేను పాడటం మొదలు పెట్టినప్పుడు పశువుల కాపరులే నా స్నేహితులు. సహచరులు. అడవి బడి అయింది. ప్రకృతి నాకు ఒడి పట్టింది. ప్రజలు పంతుళ్ళయ్యారు. అంతే పాటకు నాకు ఏదో పేగుబంధం ముడి పడిందన్నది, అర్థమైంది. ఇక పాటనే నా బతుక్కు ఆలంబన చేసుకున్నాను. అందుకే నేనన్నాను, ఒక చోట. “లోకం నా ఇల్లు. జనమంతా నా వాళ్ళు. ప్రగల్బాలు మార్చుకో….ప్రజల నుంచి నేర్చుకో…..” అని. అది ముమ్మాటికీ నిజం. నేనిప్పటికీ పాడుతున్నాను, రాస్తున్నానంటే అది ప్రజలు నాకిచ్చిన భిక్ష. వారే నా ప్రేరణ.

ప్ర:-మీ గురించి చెప్పండి?

జః- వ్యక్తిగా నాదంటూ…నా కంటూ పెద్దగా ఏమీ లేదు. మాది వరంగల్ జిల్లా చేర్యాల సమీపంలోని రేబర్తి. అక్కడే పుట్టి పశువుల కాపరిగా పెరిగిన నాకు అక్షర జ్ఞానం లేదు. బడి ముఖం చూడలేదు. ఎక్కడా అక్షరాభ్యాసం చేయలేదు. అయితే ఆ సరస్వతీ కటాక్షం లభించింది. బహుషా దైవికంగా చెప్పుకోవాలంటే నా పూర్వజన్మ సుకృతం… చారిత్రకంగా చెప్పుకోవాలంటే నేను పుట్టిన ప్రాంతం… రామాయణాన్ని రాసిన వాల్మీకి, తొలి తెలుగు విప్లవ కవి పాలకుర్కి సోమన్న, సహజకవి పండితుడు బమ్మెర పోతన్న పుట్టిన గడ్డ. అంతేకాదు తిరుగుబాటు బావుటానెగురవేసిన చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య ప్రాణార్పణ గావించిన పుణ్యభూమి.. దొర గడీని ఎదురించిన ఒక బందగీ పోరాటం, గెరిల్లా పోరట యోధుడు నల్లా నర్సింహులు గెరిల్లా యుద్ధం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణార్పణ గావించిన ఒక బైరాన్ పల్లి… ఇలా ఇవన్నీ నేను పుట్టి పెరిగిన పరిసరాలు.. అందుకేనేమో నాకు ప్రశ్నించే తత్వంతోపాటు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడే లక్షణం అలవడింది.

ప్ర:- పోతన వంటి సహజకవిలాగే మీరూ ఎదిగి రావడం విచిత్రంగా అనిపించడం లేదూ?

జః-“బాల రసాలసాల నవ పల్లవ….” పోతన్నకు నాకు పోలికేంటి? కలం హలంలందు ఘనుడాయన. తన రచనలను రాజులకు అంకితమివ్వడానికి నిరాకరించి, తన కావ్యాలను ప్రజలకు అంకితమిచ్చిన మహాకవి ఆయన. ఆయన లాగే అని కాదు కానీ, నాకు కూడా అక్షరాభ్యాసం లేకుండానే కవితలల్లే లక్షణం సహజసిద్ధంగా అలవడడం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ సంభ్రమగానే అనిపిస్తుంటుంది. కానీ అదంతా యాధృచ్చికంగానే జరిగింది కదా?

ప్ర:- మీరు కూడా అటు పశువుల కాపరిగా, తాపీ మేస్త్రీగా వ్యవసాయ పనులతోనే అనుసంధానం కలిగిన కవులే కదా?

జః- అవును పశువుల కాపరిగా ప్రారంభమైన నాజీవితం… అంచలంచెలుగా ఎదుగుతూ తాపీ మేస్త్రీగా నన్ను హైదరా’బాధ’ వరకు బతుకు లాక్కువచ్చింది. ఇక్కడే నా అసలు సిసలు రచనా జీవితం ప్రారంభమైంది. అప్పుడెప్పుడో ఆలాపనగా అల్లుకున్న పాటలు నన్ను పెనవేసుకునే ఉన్నాయి. వాటికి కార్యరూపం ఇక్కడి నుంచే ప్రారంభమైంది.

ప్ర:-మీ సినిమా రంగ ప్రవేశం గురించి చెప్పండి?

జః- నిజానికి నాకు మొదటి అవకాశం వచ్చింది. 1996లో మార్గదర్శి సినిమా ద్వారా. ఆ సినిమాలోనే నేను నా మొదటి పాట రాశాను. అప్పుడే నా కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను కరీంనగర్ కు చెందిన ఆ చిత్ర నిర్మాత సత్యనారాయణ పాటలు రాయమని అడిగారు. నా పరిస్థితిని చెప్పి నా నుంచి కాదన్నాను…అయినా సరే, వాళ్ళు మూడు నెలలు ఆగి మళ్ళీ సంప్రదించారు. కాదనలేకపోయాను. అలా ‘మార్గదర్శి’ నాకు సినీ పాటకు మార్గదర్శకమైంది. ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం వంటి సినిమాలు తీసిన సుప్రసిద్ధ దార్శనికుడు బి.ఎస్.నారాయణ నాకు వెలుతురు చూపించారు. ఆ సినిమాకు సరోజినీ అవార్డు కూడా వచ్చింది. అయితే ఆ సినిమా కంటే ముందుగానే ‘అధిపతి’ సినిమా విడుదలైంది. అందులో నేను “ఆడ బతుకే పాడు బతుకని ఏడుస్తవెందుకే చెల్లెలా!” అని రాశాను. ఆ తర్వాత పరుచూరి గోపాలకష్ణ నన్ను అక్కున చేర్చుకుని సింగన్న సినిమాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆర్.నారాయణమూర్తి సినిమాలో నేను రాసిన “సూడా సక్కని తల్లీ సుక్కల్లో జాబిల్లీ నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలవెల్లీ….మల్లీ జన్మంటూ ఉంటే ఓ యమ్మో…ఓ ఓ ఓ తల్లీ నీ కడుపున పుడతా మా యమ్మో!” పాట నాకు బాగా పేరు తెచ్చింది.

ప్ర:-ఆ పాట వెనుక కూడా ఓ కథ ఉందని, అంతకుముందే రాసుకున్నదా పాట అనీ, నిజమేనా!?

జ:- నిజమే. బిరుదరాజు రామరాజు, మా మహారాజు. అతని ఇల్లాలు సూర్యదేవమ్మ. హైదరాబాద్ లో నాకు అన్నం పెట్టి ఆదరించిన దేవత. ఆమెను గురించి రాసిందే ఆ పాట. ఆ తర్వాత ఆ సినిమాలో నారాయణ మూర్తి కోరిక మేరకు కొద్ది మార్పులతో చేర్చాం.

ప్ర:- ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు?

జ:- లెక్కించలేదు. కానీ అనేక సినిమాలు వందలాది పాటలు రాసి ఉంటాను.

ప్ర:- సినిమా రంగంలో అనతి కాలంలోనే మీరు స్క్రిప్టు రైటరుగా కూడా పేరు తెచ్చుకున్నారు కదా?

జః- అవును. గంగ సినిమాకు కథ, మాటలు, పాటలు రాశాను. ఆ సినిమా నాకు పేరు మాత్రమే కాదు అనేక అవార్డులు, రివార్డులను కూడా తెచ్చి పెట్టింది.

ప్ర:- ఏయే అవార్డులు వచ్చాయి?

జ:- నేను రాసిన ఆ మొదటి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే ‘నంది’ అవార్డులు నాలుగు వచ్చాయి. 2007 ఏడాదికి ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ గేయరచయితగా నాకు, ఉత్తమ సహాయ నటిగా ఈశ్వరీరావుకు, ఉత్తమ గేయ రచయితగా నాకు ఉత్తమ అవార్డునందించిన పాటను పాడిన కె.జె.ఏసుదాసుకు ఉత్తమ నేపథ్యగాయకుని అవార్డులు లభించాయి.

ప్ర:- మీకు ఉత్తమ అవార్డును తెచ్చిపెట్టిన ఆ పాటేమిటి?

జ:-ఎల్లిపోతున్నవా తల్లీ… నేల మసక బారిన జాబిల్లీ! అనే పాటకు నాకు నంది అవార్డు లభించింది.

ప్ర:- గంగ సినిమా కథ జోగినీ వ్యవస్థపై ఉందనుకుంటాను?

జః- గంగ సినిమా కథ తెలంగాణలోని అతి పురాతన మూఢనమ్మకంగా కొనసాగుతున్న జోగిని కథ. సమాజంలో వేళ్ళూనికుని ఉన్న ఆ కథను తెరకెక్కించిన వైనం..దాన్ని చర్చించిన తీరుకే ఆ అవార్డుల పంట పండిందని భావిస్తున్నాను.

ప్ర:- మీరు బతుకమ్మ సినిమాకు కూడా రాసినట్లున్నారు?

జ:- అవును బతుకమ్మ సినిమాకు మాటలు, రెండు పాటలు రాశాను. కథ మాత్రం ఆ చిత్ర దర్శకుడు టి.ప్రభాకర్ రాసుకున్నదే. ప్రభాకర్ లో నిజాయితీ నన్ను కట్టేపడేసింది. అంతేగాక ఆ సినిమా నిర్మాతల ధైర్యసాహసాలకు తలవంచి నమస్కరించాలి. అనుకున్న విధంగానే ఆ సినిమా విజయవంతంగా నడిచింది.

ప్రః- ఆ సినిమా విజయానికి కారణాలేమని మీరు భావిస్తున్నారు?

జ:- ఆ సినిమా కథలో తెలంగాణ ప్రజల బతుకు చిత్రం ఉంది. గంగమ్మ అయిన జోగిని లాగే… బతుకమ్మ కూడా అనాథే. బతుకంటే పోరాటమనే నేనే, బతుకుపోరాటాన్ని హీరోగా చేశాను. వందల పువ్వులు ఏర్చి కూర్చి పేర్చిన బతుకమ్మవోలే బతుకమ్మ సినిమా కూడా పవిత్రమైందే. అంతే పవిత్రంగా దాన్ని వెండి తెరమీద ఆవిష్కరించాం. సజీవమైన సింధుతులానీ నటన, సంగీతం, ప్రభాకర్ అసిధారా వ్రతం అంతా కలగలిసిన బతుకమ్మ ఎప్పటికీ ఆలా నిలిచి ఉంటుంది. జనం కూడా ఆశ్వీరిదించారు. ఆదరిస్తున్నారు.

ప్రః- పూర్తిగా ఆర్ట్, అలాగని కమర్షియల్ కూడా కాని ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ముందే ఊహించారా?

జః – నిజమే, ఆది ఆర్ట్ కాదు. అలాగని కమర్షియల్ కూడా కాదు. కానీ దాన్ని నేను ‘కమర్షియల్ ఆర్ట్’గా పేర్కొంటాను. అబద్ధానికి లోనవకుండా… అతిశయోక్తులకు పోకుండా… నిజాయితీతో నిబద్ధతతో తీసిన సినిమా అది. తెలంగాణ బతుకులో భూమి పాత్రను ఆశావహ దృక్పథంతో చర్చించాం. తెలంగాణ అంశాన్ని కూడా దానికి జోడించాం. అందుకే విజయం సాధించాం.

ప్ర:- గంగ, బతుకమ్మ మీరు రాసిన ఈ రెండు చిత్రాల విజయం వెనుక సక్సెస్ ఫార్ములా ఏదని మీరు భావిస్తున్నారు?

జః- రెండూ పవిత్రమైన సజీవమైన జీవన చిత్రాలు. ప్రజలకు బాగా దగ్గరైన తమ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన చిత్రాలవి. నేను వాటికి పూర్తి న్యాయం చేయడానికి కూడా నేపథ్యముంది. గౌరమ్మ(బతుకమ్మ)-గంగమ్మ రెండూ కలగలిసిన జీవితం నాది. అందుకే అవి అంతబాగా పండాయసుకుంటా.

ప్రః- భవిష్యత్తులో మీరు పాటల రచయిగతానే ఉంటారా? లేక మరిన్ని సినిమా స్క్రిప్టులు రాసే ఆలోచనేమైనా ఉందా?

జః- ఎప్పటికీ పాటే నా ఆలంబన..పాటే నా ప్రాణం… పాటకే నా జీవితం అంకితం… అయితే అప్పుడప్పుడు వచ్చే అనుకోని అవకాశాలు, వత్తిడిల కారణంగానే స్క్రిప్టు వైపు దృష్టి సారించాను. మంచి అవకాశాలు వస్తే సమాజహితానికి దోహదం చేసే మరిన్ని మంచి కథలు, మాటలు కూడా రాయాలనే ఉంది. కానీ నాకు స్వేచ్ఛ లభిస్తేనే తప్ప… నేను ఏ పనీ చేయను.

ప్ర:- రా.వి.శాస్త్రి చెప్పినట్లుగా గాక సినిమా రంగంలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయా?

జః- ఎందుకు లేదు. ప్రతిభకు సినిమా రంగం పట్టం కడుతూనే ఉంది. అంతెందుకు నా సంగతే తీసుకోండి.. నేను చదువుకోలేదు. నా పాట ప్రతిభాపాటవాలను చూసే కదా ఇంత మంది నాకు ఈ అవకాశాలిచ్చారు. ఇస్తున్నారు. అయితే ‘వంగడం తప్పు కాదు.. లొంగడమే తప్పు.’ సినిమా రంగంలోనే కాదు బతుకులోనూ కొంత ‘రాజీ’ తప్పదు. ఎవరికీ జై కొట్టకుండానే ప్రతిభను చాటుకోవచ్చు. ఆత్మకు, అంతరాత్మకు దెబ్బ తగలకుండా ఎవ్వడూ అల్లలేడు. చిల్లి గవ్వను కానలేడు.

ప్రః- మరిన్ని అవకాశాలు వస్తే ఎలాంటి సినిమా కథలు రాయాలనుకుంటున్నారు.?

జ:- కమర్షియల్, ఆర్ట్ సినిమాలన్న ఆలోచనేమీ లేదు కానీ, సమాజ సంగతులతోనే ముడిపడి ఉంటాయి. మట్టి పరిమళాలు వెదజల్లే మానవ ఇతిహాసం… నా దేశీయత ఆనవాళ్ళు…నా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే జీవన చిత్రాలే నా కథలవుతాయి. జీవితం అనేక వైరుధ్యాల సంగమం. అవన్నీ నా కథల్లోనూ, పాటల్లోనూ కనిపిస్తాయి.

ప్ర:- మీకు బాగా నచ్చిన పాటలు?

జ :- నేను పురుడుపోసిన ప్రతి పాటా నాకు నచ్చిందే. ‘సూడా చక్కనీ తల్లీ సుక్కల్లో జాబిల్లీ.’ గంగమ్మ, బతుకమ్మ ఇలా అనేక సినిమాల్లోని నా ప్రతిపాట నాకు నచ్చిందే.

ప్రః – తాజాగా మీకు పేరు తెచ్చిన పాటలేమిటి?

జ :-‘మాయమై పోతున్నడమ్మా… మనిషన్న వాడు..ఓ ఓ ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడూ… నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.. యాడ ఉన్నదో కాని కంటికీ కనరాడు…’ అనే పాట, మంట గలుస్తున్న మానవ విలువలు, కంటికే కనరాని మానవత్వం ఉన్న మనిషిని వెతుక్కుంటూ…నేటి జీవన పరిణామాలను, వేగాన్ని, మనిషిలోని ఆగాన్ని, స్వార్థాన్ని, దైన్యాన్ని, దౌర్బల్యాన్ని ఎత్తి చూపుతూ రాసిన పాటలు. ప్రపంచ గ్లోబలైజేషన్ విధ్వాంసానికి పరాకాష్ట ఈ పాట.

ప్ర:- ఈ పాటను పాఠ్యాంశంగా పెట్టాలనే యోచనను ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఉందే?

జ:- డిగ్రీ రెండో ఏడాది తెలుగు కావ్య విభాగంలో ‘మాయమై పోతున్నడమ్మా..’ పాటను పెట్టే యోచన చేస్తున్నట్లుగా నాకూ తెలిసింది. ఇంకా స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ప్ర : – ఆ పాట పాఠ్యాంశంగా రావడంపై మీ ఫీలింగ్?

జ:- పాటకు పట్టం కట్టడమే. నా పాటకు ప్రజలు పట్టం కడుతున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగా గుర్తించిందని భావించాల్సి ఉంటుంది.

ప్ర :- మిమ్మల్ని ఈ స్థాయికి గుర్తింపునకు తీసుక వచ్చిన పాటపై మీ ప్రతిస్పందన?

జ :- ఆనాథనైన నన్ను అందరి వాడిని చేసింది పాట. అనామకుడినైన నాకు ఆకాశమెత్తు కీర్తినిచ్చింది పాట. ఆపాటే నా బతుకు బాట.

-✍ డా. మార్గం లక్ష్మీనారాయణ

……

అందె శ్రీ పక్షి పాట

ఎంత గొప్ప వింత చూడమ్మా?
ఈ సృష్టిలో పక్షికెంతా శక్తి ఉందమ్మా?

“హస్త కళల అల్లికేదైనా.. 
బంగారు తీగెల అల్లుకునెడి సొమ్ములేదైనా
కాశ్మీరు శాలువైనా
కంచిపట్టు చీర అయినా
గిజిబిజి అల్లికలకు గిజిగాని గూడే గీటురాయి

ఎంత గొప్ప వింత చూడమ్మా?
ఈ సృష్టిలో పక్షికెంతా శక్తి ఉందమ్మా?

పద్య కవితల అల్లికైతేమీ
లోకాన గొప్ప పాట కవితల పల్లవైతేమీ
ఆది కవి నన్నయ్య అయినా,
అల్లసాని శ్రీనాథులైనా
చెల్ల గలరా చిల్లి గవ్వకు అల్లికల్లో దాని ముందర

ఎంత గొప్ప వింత చూడమ్మా?
ఈ సృష్టిలో పక్షికెంతా శక్తి ఉందమ్మా?

(ఇది మొత్తం పాటలో కొంత భాగమే)

……..

పర్సనల్ టచ్

పేరు : అందె శ్రీ
అసలు పేరు : అందె ఎల్లయ్య
జననం: 1961 జూలై 18
మరణం: 2025 నవంబరు 10
తల్లి దండ్రులు : అందె బొడ్డయ్య
భార్య : మల్లుబాయి
పిల్లలు : వెన్నెల, వాక్కులమ్మ, వేకువ, దత్తసాయి
సినిమా రంగ ఆరంగేట్రం : 1995లో మార్గదర్శి చిత్రం ద్వారా
స్క్రిప్టు రచయితగా : గంగ సినిమాతో
అవార్డులు రివార్డులు : అందెశ్రీ కథ, మాటలు, పాటలు రాసిన మొదటి సినిమా గంగకు నాలుగు నందులు వచ్చాయి. 2006 ఏడాదికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ గేయరచయిత (ఎల్లి పోతున్నవా తల్లీ! నేల మసక బారిన జాబిల్లి!!), ఉత్తమ సహాయనటిగా ఈశ్వరీరావు, ఉత్తమ నేపథ్యగాయకునిగా కె.జె.ఏసుదాసు.
సోమనాథ కళాపీఠం: 2006 జూన్ లో పురస్కారం
గౌరవ డాక్టరేట్ : కాకతీయ విశ్వవిద్యాలయం 2008 ఏడాదికి డాక్టరేట్ నిచ్చి సత్కరించింది.
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు.
అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.

……..

 

 

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News