మధుమేహం, శెక్కెర, షుగర్ పేరేదైనా గదే తీపి రోగం. గా తీపి రోగానికి మందుల్లేక, అదుపు శేయడం అలివిగాక, శానా మంది యమ యాతన పడుతున్నరు. 2022 నాటికే గీ భూమ్మీద 83 కోట్ల మందికి పైగా జనం తీపి రోగం బారిన పడ్డరట. 7.7 కోట్ల మంది మధుమేహ రోగులతోటి భారతదేశం ప్రపంచకంలోనే రెండో స్థానంలో ఉందట. గిది బతుకు గతుకుల తేడాల వల్లనే వత్తాందట. ఊకే ఉచ్చ వచ్చుడు, బాగా దూప అవుడు, ఊకుకెనే అలసట, సూపు మందగించుడు, బరువు తగ్గుడు గీ రోగం లచ్చణాలు. ఇగ గీదీంతోటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, సూపు పోవుడు, నరాల బలహీనత వత్తాందట. మరి గీదీనికి మందే లేదా? అంటే మంచి మందొకటి అందుబాటులోకి వచ్చిందట. గదేందో సూద్దాం.

గీ శెక్కెర రోగాన్ని నయం శేయడానికి నాట్కో అనే మందుల కంపెనీ సెమాగ్లూటైడ్ అనే ఇంజెక్షన్ ను దుకాన్నకు తెచ్చిందిట. గిదీని ధర నెలకు రూ.1290 కాడ మొదలై, రూ.4,500 దాకా అయితదట. గీ మందును సెమాన్యాట్, సెమాఫుల్ పేర్లతోటి మందుల దుకాన్లల్ల అమ్ముతరట. ఇగ గిది సక్కగ గా తీపి రోగంపైన్నే పని శేత్తదట. ఆకలి తగ్గుదట. కొంచెం తినంగనే కడుపు నిండినట్టనిపిస్తదట. జీర్ణక్రియ మెల్లెగ జరుగుతదట. ఇగ ఇన్సులిన్ పెరుగి గా తీపి రోగం తగ్గుతదట. బరువు కూడా తగ్గుతరట. తీపిరోగం ఉండీ బరువు బాగున్నోల్లకు ఇంకా మంచిదట. ఏప్రిల్ లో పెన్ డివైజ్ రూపంల గూడ అందుబాటులకి తెత్తరట. గా తీపిరోగం ఉన్నోల్లకు గిది తీపి వార్తే గదా?

