ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో పెళ్లికి కొన్ని నిమిషాల ముందు వధువు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పరారైన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వరుడు నీరజ్ గుప్తా, వధువు కోసం వెతికే క్రమంలో ఆమె దొంగ అని తెలిసి షాక్‌కు గురయ్యారు.
నవాబ్‌గంజ్‌కు చెందిన నీరజ్ గుప్తా, షాహాబాద్‌కు చెందిన ఓ మహిళను బాబా ప్రమోద్ ద్వారా పరిచయం చేసుకున్నారు. బాబా మాటలు నమ్మి, ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్న వీరిద్దరూ జనవరి 20న పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లికి ముందు గుడిలో పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరుడి కుటుంబం వధువుకు రూ.3.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అలంకరించారు. పూజ అనంతరం రిజిస్టర్ మ్యారేజ్ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో, సంతకాలు చేయడానికి కొద్ది నిమిషాల ముందు వధువు ఆభరణాలతో పాటు బాబాతో పరారైంది.
అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో వరుడు నీరజ్ గుప్తా, అతడి కుటుంబ సభ్యులు వధువును వెతకడం ప్రారంభించారు. చివరికి ఆమె ఒక మోసగాళ్ల గ్యాంగ్‌లో భాగమని తెలుసుకొని పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, వధువు మరియు ప్రమోద్ బాబా కోసం గాలిస్తున్నారు. మోసగాళ్లకు బాబా సహకరించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

