కొందరు కార్యకర్తలు రాళ్లతో బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడుతుంటే బీజేపీ నిశ్శబ్దంగా ఊరుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తలచుకుంటే గాంధీభవన్‌తో పాటు కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు దిగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.
రాళ్ల దాడులను ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ ధోరణిగా మారిందా? అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ రకంగా దాడులు చేసి పిల్లలు, వృద్ధులకు గాయాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని తమ చేతగానితనంగా భావించవద్దన్నారు. ఎవరు తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టడం ఏ విధంగా సరైనదని నిలదీశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. రాళ్ల దాడుల్లో పాల్గొన్నవారిపై తక్షణమే చర్యలు తీసుకొని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన కార్యకర్తలను బీజేపీ ఉపేక్షించదని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు.

