పర్వతాలు… పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం చేసే చేతులు మిన్న. మనిషి తత్వాన్ని బోధించిన కాళోజీ కంటే, మనిషి తత్వాన్ని, మానవత్వాన్ని అనుభవంలోకి తెచ్చిన కావలి పర్వతాలే మిన్న. ఆత్మబంధువా! పరమాత్మా!! పర్వతాలూ సదా స్మరామి!!!
ప్రజా సంబంధాల శాఖ పూర్వ ఉద్యోగి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారకర్త కావలి పర్వతాలు గారిని సంస్మరించుకుంటూ.. డా.మార్గం ప్రత్యేక వ్యాసం
మనిషిని మనిషి అంటే కోపం! ఎవరినైనా ‘ఏం మనిషివయ్యా?’ అని, అని చూడండి. ‘నన్ను మనిషి అంటావా?’ అని. వెంటనే ఉగ్రరూప ప్రశ్న ఉదయిస్తుంది. మనిషిని మనిషి అనిగాక ఏమనాలి? మనిషే అనాలి కదా!
1994లో పాలకుర్తిలో సోమనాథుడి అష్టమ శత జయంతి ఉత్సవాలు జరిగాయి.
తొలి తెలుగు విప్లవ కవి. తెలంగాణ ఆదికవి సోమనాథుడు. తెలుగు విశ్వవిద్యాలయం, స్థానిక సాహిత్య సంస్కృతిక సంస్థలు సోమనాథ కళాపీఠం, సోమన సాహితీ సమితి లు కలిసి నిర్వహించాయి. ఆ వేదిక కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాళోజి నారాయణ రావు ప్రసంగించారు. సోమనాథ కళా పీఠం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా ఆయనతో పాటు ఆ వేదిక పంచుకోవడం నాకు దక్కిన గౌరవం. అయితే, ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరిచారు.
కాలక్రమంలో కాళోజీ మనిషి తత్వం, మనస్తత్వం బోధపడింది. ఇంకా చెప్పాలంటే నాగర్ కర్నూలుకు వచ్చాక, కావలి పర్వతాలు గారి, అతని కుటుంబ ఆదరణతోనే, అనుభవంలోకి వచ్చి అర్థమైంది.
ఇంతకీ మనిషి అంటే ఆలోచించే శక్తి, స్పందించే గుణం, మాట్లాడే సామర్థ్యం ఉండటం. ఈ భూమ్మీద ఉన్న అత్యున్నత జీవి మానవుడు. తెలివితేటలు, ఆలోచించి కొత్త విషయాలను కనిపెట్టే శక్తి, సంతోషం, బాధ, ప్రేమ వంటి భావావేశాలు, అనుభవాలు ఉండటమేగాక, ఇతరులతో వాటిని పంచుకొని కలిసి జీవించే సామాజిక చైతన్య జీవి.

నేను 2001 జనవరి మొదటి వారం చివరిలో నాగర్ కర్నూలు కు వార్త స్టాఫ్ రిపోర్టర్ గా వెళ్ళాను. అప్పటికి భారత చిత్రపటంలో ఆ పేరుతో ఓ ఊరు ఉందని కూడా నాకు తెలియదు. అప్పటి వార్త ఎడిటర్ రామచంద్రమూర్తి గారి దాదాపు బెదిరింపు స్థాయి హెచ్చరికల ఆదేశానుసారం, అప్పటి నెట్ వర్క్ ఇంచార్జి మిట్టపల్లి శ్రీనివాస్ గారు స్వయంగా నన్ను పట్టుకుని, వెంట పెట్టుకొని మరీ నాగర్ కర్నూలు లో వదిలి వెళ్ళారు. అంతా కొత్త. అక్కడ ఏమీ తెలియదు. తెలిసిన వారెవరు లేరు. అంతా భయం, బెరుకుల మధ్య అప్పటి ఎ ఎస్ ఎం శ్రీనివాసులు తోడయ్యాడు. ఆఫిస్ లోనే మకాం. శ్రీను అక్క ఇంట్లో స్నానపానాదుల రికాం. మా ఆఫీస్ కింద నర్సింహులు హోటల్ లో భోజనం. అలా బలవంతపు బ్యాచిలర్ ను అయిన నాకు కొన్ని నెలల తర్వాత కావలి పర్వతాలు గారి ఇంటి పక్కనగల ఒక బాచిలర్స్ సింగిల్ రూమ్ లో ఓ రూమ్ మేట్ గా అవకాశం దొరికింది. అదే నాకు మనిషి తనాన్ని, మంచి తనాన్ని, మానవత్వాన్ని కావలి పర్వతాలు గారిని, పద్మక్క, అమ్మ మల్లమ్మ, సత్యం, కూర్మయ్య, నరేశ్, విజయ్, అనితమ్మల రూపంలో పరిచయం చేసింది. అదే నా, నా కుటుంబ జీవిత జీవన పర్యంతం అయింది.
నిజానికి పర్వతాలు గారు, అతని కుటుంబానికి వార్త స్టాఫ్ రిపోర్టర్ గా తప్ప, నా ఊరు పాలకుర్తి అని తెలియదు. పాలకుర్తిలో సోమనాథుడు అనే గొప్ప వ్యక్తి ఉండేవాడని, అతను మహాకవి అని ఇప్పటికీ తెలవదు. వీరనారి చాకలి ఐలమ్మది కూడా పాలకుర్తి అని తెలవదు. అంతెందుకు? నా పేరు తప్ప, ఊరు పేరూ, అడ్రస్, ఉనికి, ముక్కు, ముఖం, మంచి, చెడు, నేపథ్యం, ప్రస్తుత పథం ఏమీ తెలియదు. అయినా, పర్వతాలు గారు మనిషి లా ఆలోచించాడు. మహా మనీషి లా ప్రవర్తించాడు. మనసు వెన్న కాబట్టి, అన్నం పెట్టాడు. ఆదరించాడు. నన్ను, నా కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నాడు. మానవత్వంతో మనిషి తత్వం రుచి చూపాడు.

పర్వతాలు గారి ఇల్లు దాటితే తప్ప నా రూమ్ కు వెళ్ళలేను. బయటకు రాలేను. పొద్దున్నే తయారై బయటకు వస్తే చాలు అమ్మ మల్లమ్మ గారు అడ్డంగా నిలబడేది. ఇంటికి పిలిచి వేడివేడిగా రొట్టె, అన్నం, టిఫిన్ ఏదో ఒకటి తిన్నాకే వదిలేది. మధ్యాహ్నం భోజనానికి రమ్మనేది. నేను రాక పోతే, అప్పటికే డి ఎల్ పి ఆర్ ఓ ఆఫీసు నుంచి వస్తూ, పర్వతాలు గారు నన్ను పట్టుకుని ఇంటికి వచ్చే వాడు. ఇక రాత్రి అమ్మ నా కోసమే చూస్తూ ఉండేది. అర్థ రాత్రి అయినా సరే, అమ్మ నా అలికిడికి లేచి, అడ్డం పడేది. తిన్నానని చెప్పినా సరే, ఎంగిలి పడ్డాక గానీ వదిలేది కాదు. ఒక్క అమ్మే కాదు. అమ్మ లాంటి అక్క, నాయిన లాగా పర్వతాలు గారు డ్యూటీలు వేసుకున్నట్లు, నన్ను వాళ్ళ పిల్లల్లా సాదుకున్నారు. ఎవరికి ఎవరం? ఎక్కడి వాళ్ళం? ఇది ఎన్ని జన్మల బంధం? ఎప్పటిదీ రుణానుబంధం?
తర్వాత కొంతకాలానికి నా శ్రీమతి శ్రీమతి రమ మార్గం, ఐదేళ్ల నా కొడుకు సాయి తేజ మార్గంతో అదే సింగిల్ రూమ్ లోకి దిగారు. అప్పటి దాకా నా ఒక్కడి నుంచి మా ముగ్గురికి ఇవే మర్యాదలు. ఆ తర్వాత నా బిడ్డ సాత్విక మార్గం పుట్టాక నలుగురికీ ఇవే మర్యాదలు. మేం నాగర్ కర్నూలు లో ఉన్నన్ని రోజులు ప్రతి రోజూ పండుగే. ప్రతి పండుగా పర్వతాలు గారి ఇంటిలోనే. నా భార్య వాళ్ళింటి అడపడచైంది. ఆ ఇల్లు మాకు దేవాలయమైంది. మాకే కాదు మాలాంటి వాళ్లెందరికో ఆ ఇల్లు ఇప్పటికీ పవిత్రమైన గుడే!

నన్నే కాదు. నాలాంటి వాళ్ళెందరినో ఆదరించాడు. అక్కున చేర్చుకున్నాడు. తన చిన్నమ్మ బిడ్డ అలివేల ను సొంత ఆడబిడ్డలా చూస్తూ, ఆమె కూతురు గీతను, కొడుకు నరేశ్ లను చదివించి ప్రయోజకులను చేశాడు. పెళ్ళిళ్ళు చేశాడు. సత్యం, కూర్మయ్యలను సొంత కాళ్ళ మీద నిలబడేదాకా వెన్నుదన్నుగా ఉన్నాడు. బీర్బల్, వెంకటయ్యలకు మార్గదర్శి అయ్యాడు.
కనిపించే బ్రహ్మ-సరస్వతి, శ్రీమహా విష్ణువు-లక్ష్మీ, పార్వతీ-పరమేశ్వరులే కావలి పర్వతాలు గారు, పద్మక్కలు. వాళ్ళు మాట్లాడుకున్నట్లే తెలియదు. వాళ్లిద్దరి కమ్యూనికేషన్ ఏమిటో గానీ, పనులు అత్యంత పకడ్బందీగా జరిగిపోతుంటాయి. అక్క చేతి వంట అద్భుతం. అన్నట్లు పర్వతాలు గారు వంటల వల్లభుడే! వరంగల్ కు బదిలీపై వెళ్ళాక, కోర్టు పని మీద ఓసారి అక్కలేని టైమ్ లో నాగర్ కర్నూలు కు రావాల్సి వచ్చింది. నేను స్నానం చేసి వచ్చినంతలోనే, బగారా అన్నం, టమాటా కూర వండి పెట్టిండు. అమృతం.
పర్వతాలు గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. అమ్మ ఒడిలో ఉన్నప్పుడే, చిన్నప్పుడే తండ్రి కాలం చేశాడు. తల్లి కూలీ మీద బతుకు బండి నడిచింది. చిన్నా చితకా, చాలా పనులు చేశాడు. హాస్టల్ లో చేరి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. ఎవరి సలహా మీదనో సినిమా ఆపరేటర్ అయ్యాడు. ఆ విద్య కరతలామలకం. ఆతర్వాత ప్రభుత్వ పౌర సంబంధాల శాఖలో ఆడియో విజువల్ ఆపరేటర్ గా చేరి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారకర్తగా 30 ఏండ్ల పాటు సేవలు అందించాడు. ఉద్యోగ జీవిత పరిమితత్వాన్ని అర్థం చేసుకొని, వ్యాపార ప్రవృత్తిని అనుసరించాడు. ఆదాయం పెంపుతో, తను బతకడమే కాదు, పదిమందిని బతికించడానికి, ఆపన్నులను ఆదుకోవడానికి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చివరి వరకు జీవితాన్ని ధార పోశాడు. సాదా సీదా జీవితం.. కలిమిలేమిలోనూ చేతికి ఎముకలేని తనం.

పర్వతాలు గారిది ఇంత తొందరగా తనువు చాలించాల్సిన వయసు కాదు. అనారోగ్యం ఆయన్ని, ఆయనలోని ఉరిమే ఉత్సాహాన్ని అతలాకుతలం చేసింది. అయినా, ఆయన వెరువలేదు. బెదరలేదు. జీవితంతోనే పోరాట చేసిన ఆయనకు మృత్యువుతో పోరాటం ఇబ్బంది కాలే. కానీ, ఎంతో గొప్పగా బతికి, పలువురిని బతికించి చివరకు ఆయన భూతల్లి ఒడికే చేరాడు. జాతస్య మరణం ధ్రువం.
పర్వతాలు గారు పేరుకు తగ్గట్లే. మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం చేసే చేతులు మిన్న. మనిషి తత్వాన్ని బోధించిన కాళోజీ కంటే, మనిషి తత్వాన్ని, మానవత్వాన్ని అనుభవంలోకి తెచ్చిన కావలి పర్వతాలే మిన్న. ఆత్మబంధువా! పరమాత్మా!! పర్వతాలూ సదా స్మరామి!!!

-డా. మార్గం లక్ష్మీనారాయణ
………………..


