సాగునీరు కాల్వల పరిశీలనలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజరామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గానికి సాగు నీరు అందించే నవాబ్ పేట రిజర్వాయర్, కొడకండ్ల మండలంలోని నరసింగాపురం గ్రామంలో ఉన్న బయ్యన్న రిజర్వాయర్ ను, పాలకుర్తి మండలంలోని శాతపురం, దుబ్బతండా, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామాల్లో 4L, 7L కాల్వలు, సింగరాజుపల్లి, పెద్దమడూరు, చిన్నమడూరు గ్రామాల నుంచి 4L కాల్వలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలకు సాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేశానికి వెన్నెముక రైతన్న అని రైతులు బాగుంటేనే మనం బాగుంటాం అన్నారు. అందుకే రైతుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోంది అన్నారు. నన్ను గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తనదేనన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా… ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమాల్లో బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

