మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పార్లమెంట్లో మాట్లాడిన ఆయన, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారనే ఆరోపణలు చేశారు.
మహారాష్ట్రలో కేవలం ఐదు నెలల వ్యవధిలో 70 లక్షల కొత్త ఓటర్లను చేర్చారని రాహుల్ పేర్కొన్నారు. షిర్డీలో ఒకే భవనానికి 7,000 ఓటర్లను కేటాయించారని, ఇది ఓటర్ల జాబితాలో జోక్యానికి నిదర్శనమని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలతో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇది అనుమానాస్పదమని తెలిపారు.
ఈ వివాదంపై ఎన్నికల కమిషన్ వెంటనే ఓటర్ల డేటాను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
భారతదేశం ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో విఫలమైందని, అందువల్ల చైనాకు పెద్దగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని రాహుల్ గాంధీ అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ మంచి ఆలోచన అయినప్పటికీ, దాన్ని అమలు చేయడంలో ఎన్డిఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కులగణన పూర్తయిందని రాహుల్ వెల్లడించారు. దేశంలో 90 శాతం జనాభా ఉండే బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు తగిన హక్కులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

