వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తి అని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆమె మొట్ట మొదటి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, ఆమెపై రూపొందించిన డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఆ తరువాత వచ్చే నెల 2వ తేదిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో కాంస్య విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శం అని పాశం యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి. ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని పాశం యాదగిరి అన్నారు.
ఐలమ్మ పోరాట ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగాలని డిమాండ్ చేశారు. బడుగులు, బలహీన వర్గాలకు ఐలమ్మ చరిత్రను తెలపాలి అన్నారు. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని, వారి విగ్రహాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడమే కాదు వారి చరిత్రను ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా… చర్యలు తీసుకోవాలన్నారు. ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో, పేదలు, బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అని పాశం యాదగిరి అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత డా.రవికాంత్, దర్శకురాలు డా. సంధ్య, సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా.రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీ నారాయణ, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావు, సామాజిక ఉద్యమకారులు మాచర్ల సారయ్య, గుమ్మడి రాజుల సాంబయ్య, గూడూరు లెనిన్, మార్గం సాయి సందీప్ తేజ, ఈదునూరి మదార్, సంగి వెంకన్న యాదవ్, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల మంజుల, చిట్యాల యాకయ్య, చిట్యాల సంపత్, చిట్యాల శ్వేత, చిట్యాల కొండయ్య, చిట్యాల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

