రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు YSRCP నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. రేపు, 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మాత్రమేని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, వేరే పదవులు, ప్రయోజనాలు లేదా డబ్బు ఆశిస్తున్నట్లుగా ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, ఆయన వైయస్ కుటుంబానికి, ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తన రాజకీయ జీవితంలో సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. “నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. జగన్ గారు నన్ను రెండు సార్లు రాజ్యసభకు పంపించారు. భారతమ్మ గారు నాకు ఎంతో పెద్ద స్థాయి అందించారు. వారికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు” అన్నారు. అలాగే, తనకు రాజకీయాల్లో ప్రోత్సాహం ఇచ్చిన ప్రధాని మోడీ గారు, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేశా” అని చెప్పారు.
ఇంకా, టీడీపీతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉన్నట్లు పేర్కొన్నారు. తన భవిష్యత్తును రైతుగా కొనసాగిస్తానని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనను ఆదరించిన రాష్ట్ర ప్రజలు, మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

