గీమె ధైర్యానికి మెచ్చుకోవాలె. ఇద్దరి దొంగలతో తలపడి, కొట్లాడి తన సంక సంచిని గా దొంగల శేతికి శిక్కకుండ కాపాడుకుంది. పానాలను గూడ దక్కించుకుంది. గదెట్లనో సూడుండ్రి.

శీకటి పడ్డది. బాగా రాత్రైంది. గా అవ్వ ఎట్నుంచి వత్తాందో గనీ, ఓ సందు మూల మలుపు తిరుగుతాంది. ఎదురుంగ ఓ సైకోల్ మోటర్ మీద ముగ్గురు వచ్చిండ్రు. గా ఎన్క కూసున్నోడు దిగిండు. మద్దె కూసున్నోడు కావాలి కాత్తాండు. మూడోడు గా అవ్వ సంక సంచిని గుంజిండు. రాలే. కుదేసిండు. మోరీల పడేసిండు. పైకి గుంజిండు. కింద పడేసిండు. తొక్కిండు. ఎదురుబొచ్చె మీద తన్నిండు. మేక తిత్తి తీసినట్లు ఎడ్మ శేతి భుజం మీద కాలు పెట్టి గుంజిండు. అయినా గా సంక సంచిని వదల్లే. దగ్గరికి గా మోటర్ సైకిల్ నడిపేటోడు వచ్చిండు. గవాడు కూడ దిగాలనుకున్నడు. కనీ, గా అవ్వ శెండు లెక్క ఎగిరింది. కనీ, గా సంక సంచిని మాత్రం వదల్లే. ఇగ శేసేది లేక గా అవ్వను, గా సంక సంచిని గాడ్నే ఒదిలి పెట్టి, గా దొంగలు పరారైండ్రు. అవ్వగూడ గాడినుంచి ఇంటికి పోయింది. గిదంతా గా ఎదురుంగ ఉన్న ఇంటి సీసీ కెమెరాల రికార్డైంది. గిది గా ఉత్తర ప్రదేశ్ రాస్ట్రంల ఇటావాల జరిగింది.
ఇగ గిదీన్ని గా నెట్టింట్ల పెట్టిండ్రు. గదానికి లైకులే లైకులు. బొచ్చెడు మెచ్చుకోల్లు.. గా అవ్వ తెగువ సూసినోల్లు గా అవ్వకు అవార్డివ్వాలంటున్నరు. గీ తెగువ, సత్తువ మన ఆడోల్ల సొంతం. గవాల్ల తెరువు పోకుండ్రి.

