ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు కొలమానం. రాబోయే రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ ప్రపంచ ప్రజల సంక్షేమానికి ఎంతవరకు దోహదపడుతుందో సభ్య దేశాల రాజకీయ సంకల్పం, పరస్పర విశ్వాసం, కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. భారత్ నాయకత్వం ఈ మార్పునకు బలమైన పునాది వేయగలిగితే బ్రిక్స్ ప్రపంచ వ్యవస్థలో ప్రభావవంతమైన, సమగ్ర, ఫలితాల ఆధారిత వేదికగా ఎదగగలదు.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్న వేళ భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 12–13 తేదీల్లో ఢిల్లీలో నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ సమావేశం ప్రపంచ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తోంది. ఆహారం, ఇంధనం, ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, కీలక సరఫరా వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై సహకారం పెంపొందించడంతో పాటు ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రధాన ఎజెండాగా మారాయి. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సు మన దేశ దౌత్య సామర్థ్యానికి కూడా పరీక్షగా నిలుస్తోంది.
2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా దేశాలతో ప్రారంభమైన బ్రిక్స్ 2010లో దక్షిణాఫ్రికా చేరికతో విస్తరించింది. అనంతరం ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా వంటి దేశాలు చేరడంతో సభ్యత్వం 11 దేశాలకు పెరిగింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కూటమి, కొనుగోలు శక్తి సమానత్వం ప్రాతిపదికన ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 40% వాటాను కలిగి ఉంది. ఈ గణాంకాలు బ్రిక్స్ ప్రాధాన్యతను చాటుతున్నాయి. అయితే జనాభా, ఆర్థిక పరిమాణం పెరగడం మాత్రమే విజయానికి కొలమానం కాదు. సభ్య దేశాల మధ్య సమన్వయం, పరస్పర విశ్వాసం, కార్యాచరణ సామర్థ్యమే సంస్థ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
బ్రిక్స్ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సంస్థను కొత్త దశలోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఎవరికీ వ్యతిరేకంగా కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్నదే బ్రిక్స్ విధానంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ దృక్పథం కూటమిని కేవలం పాశ్చాత్య వ్యతిరేక వేదికగా కాకుండా అభివృద్ధి, సమానత్వం, సహకారానికి ప్రతీకగా నిలబెట్టే ప్రయత్నం. ప్రపంచ పాలనలో సంస్కరణల కోసం సమగ్ర రోడ్‌మ్యాప్ రూపొందించాలని, ప్రాతినిధ్యం, స్పందనాత్మకత, నియమాల రూపకల్పన అనే మూడు అంశాలు దీనికి ప్రాతిపదికగా ఉండాలని సూచించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను వాయిదా వేయరాదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వాటి ప్రాతినిధ్యం మాత్రం పరిమితమై ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో భారత్ ఓటింగ్ వాటా 2.64 శాతమే. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దేశానికి ఇంత పరిమిత ప్రాతినిధ్యం ఉండటం సంస్కరణల ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది.
విశేషాధికారాల పిరమిడ్‌ను భాగస్వామ్య వేదికగా మార్చాలి’ అన్న మోదీ సందేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భద్రతా మండలి విస్తరణ, శాశ్వత సభ్యత్వం వంటి అంశాల్లో సభ్య దేశాల ప్రయోజనాలు భిన్నంగా ఉండటంతో ఏకాభిప్రాయం సాధించడం అంత సులభం కాదు.
యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల అస్థిరత, వాతావరణ మార్పులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం బలోపేతం కావాలి. స్థానిక కరెన్సీలలో వాణిజ్య చెల్లింపులను ప్రోత్సహించడం, సరిహద్దు చెల్లింపు వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు డాలర్‌పై ఆధారపడటాన్ని కొంత తగ్గించగలవు. ఆరోగ్యం, డిజిటల్ మౌలిక వసతులు, కృత్రిమ మేధస్సు, ఇంధన భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో సంయుక్త కార్యాచరణ రూపొందితే ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది.
చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలతో పాటు పాశ్చాత్య దేశాలతోనూ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌కు సమతౌల్య దౌత్యం అవసరం. చైనాతో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాలను కొనసాగించాల్సి ఉంది. 2025లో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 155.6 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ, భారత్‌కు చైనాతో వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు కొలమానం. రాబోయే రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ ప్రపంచ ప్రజల సంక్షేమానికి ఎంతవరకు దోహదపడుతుందో సభ్య దేశాల రాజకీయ సంకల్పం, పరస్పర విశ్వాసం, కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. భారత్ నాయకత్వం ఈ మార్పుకు బలమైన పునాది వేయగలిగితే బ్రిక్స్ ప్రపంచ వ్యవస్థలో ప్రభావవంతమైన, సమగ్ర, ఫలితాల ఆధారిత వేదికగా ఎదగగలదు.

