నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే. గండ్లనే కొన్ని మంచియుంటయి. కొన్ని శెత్తయుంటయి. గట్లనే గీ కోతి మంచి బుద్ధిని మనుసులు కూడ అలవాటు సేసుకుంటే ఎంత బాగుంటదో! అయితే గా కోతేం శేసిందో మీరే సూడుండ్రి.

గా కోతికి దూపైంది. గటిటు సూడంగ ఓ నల్లల నీల్లొత్తానయి. గా నల్ల తెరిసే ఉంది. గాడికి పోయింది. సోచాయించింది. గా నల్లకు మూతి పెట్టి గిన్నన్ని నీల్లు తాగింది. మల్లా ఆగింది. నీల్లు పోతనే ఉన్నయి. ఆలోసించింది. గా నల్లాను కిందికి ఒత్తి బంద్ శేసింది. మల్లా గిన్నన్ని నల్ల ముందర శిన్న బొంద లెక్క పడ్డ నీల్లను తాగింది. గింత శేసినా, ఎంతైనా కోతి కోతే కదా? గాయింత గా గుంటల తన పతిమ కనబ్తాంది. గా నీల్ల మీద శేయి పెట్టి గటిటు అని గా బొమ్మను శెదరగొట్టింది. గా కోతి మనసుల ఏముందో గనీ, గీ మనుసులకు నీల్ల ఇలువను శెప్పింది. నీటిని ఊకుకెనే పోనీయొద్దని, కాపాడుకోవాలని గొప్ప సందేశమిచ్చింది. గీ ఈడియో గిప్పుడు నెటింట తెగ వైరల్ అయితాంది. ఏడ దొరికిందో గనీ, గిదీన్ని గా ఉత్తరాఖండ్ పోలీసులు షేర్ శేసిండ్లు. మనం గూడ ఆలోసించాలె. నీటిని పొదుపుగ వాడి, మన ముందు తరాలకు అందించాలె. ఏమంటరు?

