వరంగల్ హెల్త్ సిటీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం ఆపి అభివృద్ది పనులు చేయండి
మీరు ఈ హెల్త్ సిటీ పూర్తి చేయకపోతే BRS పార్టీ పోరాటం చేస్తుంది
వరంగల్ హెల్త్ సిటీ పనులు పరిశీలించిన BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు
అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు
వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణం సంవత్సర కాలంగా నిలిచిపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు ఆయన వరంగల్ పర్యటనలో భాగంగా హెల్త్ సిటీని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనతో ఉత్తర తెలంగాణకు తలమానికంగా హెల్త్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని. ఈ ఆస్పత్రి 14 అంతస్తుల వైద్య సేవల విభాగంతో పాటు, మిగిలిన 10 అంతస్తులు ల్యాబ్‌లు, లైబ్రరీలు, బ్లడ్ బ్యాంక్, డాక్టర్లకు, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు. అలాగే హెల్త్ సిటీ నిర్మాణం 84 శాతం పూర్తయిందని, మిగతా 16 శాతం పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా తాత్సారం చేస్తూ, అనవసర కారణాలు చూపుతోందని హరీష్ రావు విమర్శించారు.

అలాగే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, పత్రికల్లో ప్రతి రోజు ఆస్పత్రి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని, ఆస్పత్రి నిర్వహణను సరిచేసే ప్రయత్నాలు చేయకుండా, హెల్త్ సిటీ పనులను నిలిపివేయడం ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి లక్ష్యం వుందో అర్థం చేసుకోవాలని హరీష్ రావు అన్నారు. జైపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఆస్పత్రి నిర్మించినప్పుడు సమర్థించుకున్న వాళ్లు, వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణానికి అడ్డంకులు కల్పించడం ఏం న్యాయం అని హరీష్ రావు సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. కేసీఆర్ మొదలుపెట్టిన రైతుబంధు, బతుకమ్మ చీరెల పంపిణీ, దళిత బంధు వంటి పథకాలన్నింటినీ నిలిపి వేయడం ప్రజల గురించి పట్టించుకోకపోవడమేనని అన్నారు. వరంగల్ హెల్త్ సిటీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హెల్త్ సిటీ నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను కొనసాగించకపోతే మా BRS పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. అలాగే కేసీఆర్ ఆలోచనలకు ప్రజల్లో మద్దతు ఉందని, హెల్త్ సిటీ వంటి ప్రాజెక్టులను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని, హెల్త్ సిటీ పూర్తి చేయడంలో ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

