యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అమెరికా హెచ్చరికలతో ఇరాన్‌లో కలవరం మొదలైంది. అణు కేంద్రాల వద్ద అయోడిన్ మాత్రల పంపిణీ యుద్ధ భయాలకు అద్దం పడుతోంది. ప్రపంచ శాంతికి దౌత్యమే ఏకైక మార్గం.
మార్గం – అడుగు, ఎడిటోరియల్
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరోసారి కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశలు కలగడం, మళ్లీ హెచ్చరికలు, ప్రతిహెచ్చరికలతో పరిస్థితి మొదటికి రావడం పరిపాటిగా మారింది. దౌత్య చర్చలు జరిగిన ప్రతిసారీ శాంతి దిశగా అడుగులు పడతాయని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నా, ఆచరణలో మాత్రం అలాంటి పురోగతి కనిపించడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఒత్తిడి మరోసారి యుద్ధ భయాలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా సైనిక చర్యలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అణు కేంద్రాలకు సమీపంలో నివసించే ప్రజలకు అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటన్‌కు చెందిన ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు అణు కేంద్రాల చుట్టూ రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు ఈ మాత్రలు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అణు ప్రమాదం సంభవిస్తే రేడియోధార్మిక అయోడిన్ ప్రభావం నుంచి థైరాయిడ్ గ్రంథిని కొంతవరకు కాపాడేందుకు పొటాషియం అయోడైడ్ ఉపయోగపడుతుంది. అయితే ఇది అన్ని రకాల రేడియేషన్ నుంచి రక్షణ కల్పించదు. ప్రభుత్వ, వైద్య అధికారుల సూచన మేరకే వీటిని వినియోగించాలి. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక సమాచారం అందించే వారికి 20 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.177 కోట్లకు పైగా బహుమతి ప్రకటించడం అమెరికా వ్యూహంలో మరో కీలక పరిణామం. అణు కేంద్రాలు, సెంట్రిఫ్యూజ్‌లు, యురేనియం శుద్ధి, అణు శాస్త్రవేత్తలు, సంబంధిత సిబ్బంది కార్యకలాపాలపై సమాచారం కోరుతోంది. అవసరమైతే సమాచారమిచ్చే వ్యక్తులను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాన్ని కూడా ప్రకటించింది. ఇదిలా ఉండగా, నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలోని పికాక్స్ మౌంటైన్‌పై అమెరికా దాడి చేసే అవకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అక్కడ భారీ భూగర్భ నిర్మాణాలు ఉన్నట్లు కథనాలు వస్తున్నప్పటికీ, వాటి అసలు స్వరూపంపై పూర్తి వివరాలు బహిరంగంగా నిర్ధారణ కాలేదు. అమెరికా ఈ ప్రాంతంపై దాడికి నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అయినప్పటికీ ఇలాంటి పరిణామాలు ఇరాన్‌లో ఆందోళనలను పెంచుతున్నాయి. యుద్ధం ప్రారంభించడం సులభమే కానీ దాని పరిణామాలను నియంత్రించడం అంత సులభం కాదు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే ప్రాణనష్టం, పర్యావరణ కాలుష్యం, రేడియేషన్ ముప్పు ఒక్క ఇరాన్‌కే పరిమితం కాకుండా పొరుగు దేశాలకూ విస్తరించే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ చమురు సరఫరా, వాణిజ్యం, ఇంధన ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనిశ్చితితో సతమతమవుతున్న ప్రపంచానికి మరో యుద్ధం పెను భారంగా మారుతుంది. ఆధిపత్య పోరాటాలు, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రాణాలు, ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శాంతికే ప్రాధాన్యం ఇవ్వాలి. హెచ్చరికలు, ప్రతీకార ప్రకటనలు పక్కనపెట్టి అమెరికా, ఇరాన్ దేశాలు చర్చల బాట పట్టాలి. యుద్ధంలో విజేతలు ఉండకపోవచ్చు.. కానీ నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే అన్న వాస్తవాన్ని ఇరు దేశాల పాలకులు గుర్తించాలి.

