ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ, అసలు పేషెంటును పట్టుడే లేదు పభుత్వ దవాఖాన్లల్ల. ఇగ గిసొంటి సమయంల గా ‘డాక్టర్ నెట్ ఇండియా’ పేదలకు పెన్నిధిగ నిలుత్తాంది. గదాని సంగతేందో సూద్దాం పదండ్రి.

తమిళనాడు కోయంబత్తూరుకు శెందిన అరవిందన్-అభిరామి ఆలుమొగలు. గీ ఇద్దరూ అమెరికల పని శేసి ఇండియాకు వచ్చిండ్రు. ఇద్దరూ వైదుగులు కారు. కానీ, నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందించాలని అనుకున్నరు. డాక్టర్లను కలిసిండ్రు. 700 మంది వైదుగులను ఏకం శేసిండ్రు. ‘డాక్టర్ నెట్ ఇండియా’ ఏర్పాటు శేసిండ్రు. ఆ వైదుగులు లేదా వారు పని చేస్తున్న దవాఖాన్లల్ల సిఫారసుల ద్వారా ఇప్పటి వరకు 4,200 మంది పేషెంట్లకు వైద్గం అందించిండ్రు. అయితే ఉచితం, లేదంటే రాయితీల మీద ఆపరేషన్లు, వైద్గం, మందులు అందిత్తరు. మందులు యేసుకుని నయమయేదాకా సాయంగా నిలుత్తరు. ఇంట్లో వాల్లకు ఉద్యోగాలిప్పిత్తరు. పిల్లగాండ్లుంటే సదువులు సెప్పిత్తరు. గిప్పటి దాకా గిట్ల కోటి రూపాయెల యిలువైన వైద్గం అందించిండ్రు. ఒక్క కోయబంత్తూరు, దాని సుట్టుపక్కలే కాదుల్లా.. తమిళనాడు, కేరళంల కూడా గిట్ల శేత్తాండ్రు. ఇంకా తమ నెట్ వర్క్ ని సంప్రదిత్తే, దేశంల ఎక్కడి వాళ్లకైనా వైద్గం అందిత్తరట. గిట్ల ఏడాదికి 400 నుండి 500 మందికి వైద్గం అందిత్తాండ్రట. మంచిగుంది కదా గీ ‘డాక్టర్ నెట్ ఇండియా’ పని.

