ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య
తెలంగాణలో కుల గణనను తూతూ మంత్రంగా నిర్వహించారని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కుల గణన చేయడం ద్వారా ప్రభుత్వ విధానం పై అనుమానాలు కలుగుతున్నాయని, బీసీల సంఖ్యను తక్కువగా చూపేందుకు ఈ ప్రక్రియను అవకతవకలతో నిర్వహించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతామని ప్రకటించినా, దాన్ని చట్టబద్ధంగా అమలు చేయకపోతే తాము ఎన్నికలను ఎదుర్కుంటాం అని స్పష్టం చేశారు.
బీసీల హక్కులను కాపాడేందుకు తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన న్యాయం చేయకుండా అన్యాయానికి పాల్పడుతున్నదని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల పెంపును అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానం తప్పించుకునేలా కాకుండా, బీసీల హక్కులను పరిరక్షించేలా ఉండాలని హితవు పలికారు.

