TELANGANA| తెలంగాణలో LIQUOR| మద్యం RATES| ధరలు తగ్గే సూచనలు!
తెలంగాణలో మద్యం వినియోగదారులకు శుభవార్త వినిపిస్తోంది. త్వరలోనే BEER| బీరు, మద్యం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్‌లో పోటీ పెరుగుతూ, కొత్త బ్రాండ్లు ప్రవేశించడమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (TGBCL) ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు భారీ స్పందన లభించింది. దాదాపు 92 కంపెనీలు తమ 604 బ్రాండ్లను రాష్ట్ర మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు అర్జీలు సమర్పించాయి. వీటిలో 331 దేశీయ బ్రాండ్లు కాగా, 273 విదేశీ బ్రాండ్లు ఉండటం గమనార్హం.
ఇప్పటికే ఉన్న 45 కంపెనీలతో పాటు 47 కొత్త కంపెనీలు పోటీలో దిగడంతో మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఈ పోటీ కారణంగా వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు లభించడంతో పాటు, ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా గతంలో బీర్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL)తో చర్చలు జరిపింది. రూ.658 కోట్ల బకాయిల సమస్యను పరిష్కరించడంతో కింగ్‌ఫిషర్, హైనెకెన్ వంటి బ్రాండ్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ రూ.34,600 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో వినియోగదారులకు నాణ్యత గల ఎంపికలు లభించడమే కాకుండా, ధరలు తగ్గి మార్కెట్ స్థిరపడే అవకాశముంది.
ఇకపోతే, దరఖాస్తుల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ, ప్రజాభిప్రాయాల కోసం 10 రోజుల వ్యవధి ఇవ్వడం ద్వారా పారదర్శకతను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. కమిటీ సూచనల ఆధారంగా తుది ధరల సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మొత్తంగా, వినియోగదారులకు ఇది పండుగలా మారే అవకాశం ఉందని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

