మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మానవతా విలువలకు విరుద్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 20 ఏళ్ల యువతిని ఆమె తల్లిదండ్రులు చైనుతో కట్టేసి రెండు నెలలుగా ఇంట్లోనే నిర్బంధించారు. ఆమెను భర్తను కలవనివ్వకుండా, ఇంటి బయటకు వెళ్లనివ్వకుండా కఠినంగా నిర్బంధించారు.
జల్నాలోని ఓ గ్రామానికి చెందిన షానాజ్ అలియాస్ సోనాల్ మూడేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండు నెలల క్రితం తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లిన ఆమెను, తిరిగి భర్త వద్దకు వెళ్లనివ్వకుండా బలవంతంగా తమ వద్దే ఉంచుకున్నారు. భర్త న్యాయపోరాటం చేసి తన భార్యను రక్షించేందుకు ఆమె భర్త పలుమార్లు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. చివరికి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం ఆమె తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేసి, సోనాల్‌తో పాటు ఆమె చిన్న కుమారుడిని కూడా రక్షించారు.
ప్రభుత్వ న్యాయవాది సమక్షంలో సోనాల్‌ను భర్తకు అప్పగించారు. ఇప్పటివరకు ఆమె తల్లిదండ్రులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

