అడుగు ఎఫెక్ట్!
-వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వెల్లడి
వర్ధన్నపేట, ఏప్రిల్ 2 (అడుగు న్యూస్): ‘అడుగు’ లో వచ్చిన వార్తా కథనానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు స్పందించారు. ‘‘కిస్సా ఇసుక కా? ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అతి ప్రయత్నం మీద కాపాడిన పోలీసు యంత్రాంగం. ప్రభుత్వ ఇసుక పాలసీ తో ఇ‘బ్బందులు’. ‘స్థానిక దందా’ను కొనసాగించాలని విన్నపాలు. వినిపించుకోలేదని ఎమ్మెల్యేపై డౌన్ డౌన్ నినాదాలు. అప్పటికప్పుడు ధర్నాకు దిగిన ఇసుక దందాదారులు. తమ భర్తలను కాపాడాలంటూ మహిళల వేడుకోలు’’ అంటూ ‘అడుగు’లో ఏప్రిల్ 2వ తేదీన ప్రత్యేక కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేటలో బుధవారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
ఇసుక ఇష్యూ స్థానికం కాదని, తమ పరిధిలో లేదని, రాష్ట్ర స్థాయిలో స్టేట్ పాలసీగా ఉందని తేల్చి చెప్పారు. ఆవిషయమై ఏ నిర్ణయమైనా సరే, సీఎం తీసుకోవాల్సిందేనని చెప్పారు. తాను తన నియోజకవర్గంలో ఏ నిర్ణయం తీసుకున్నా, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతందన్నారు. అలా చేయడం సరికాదన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను తాను ఎప్పటికప్పుడు తమ నియోజకవర్గ ప్రజలతో చర్చిస్తున్నానని అన్నారు. అలాగే ఆయా సమస్యలను సీఎం, మంత్రుల ద్రుష్టికి తీసుకెళుతున్నానని, అలాగే వాటి పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్థానిక అవసరాల రీత్యా తగు నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరైనా సరే, వేచి చూడాలన్నారు. ఇసుక అందరికీ అవసరమేనని, స్థానికావసరాలకు సరిపడే నిర్ణయాన్ని సీఎం తీసుకుంటారన్న ఆశాభావాన్ని
ఆయన వ్యక్తం చేశారు. అప్పటి వరకు స్థానిక ప్రజలు ఓపిక పట్టాలని ఆయన కోరారు.

