పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.. కొద్ది రోజుల్లనే యిడిపోతాండ్లు. గీ పెండ్లి మాత్రం రోజులు కాదు కదా, గంటల్లనే పెటాకులైంది.

గీ మనువు, యిడుపుకాయితం ముచ్చట తమిళనాడుల జరిగింది. ఇగో కన్యాకుమారి జిల్లా కుళచ్చల్కి అనే ఊరాయెన 31ఏండ్లున్న సైనికుడు. కన్యాకుమారి-కేరళం సరిహద్దుల పారసాలై అనే ఊరుంటది. గా ఊల్లె 26ఏండ్లుండే ఒకామె పేమించుకున్నరు. గామె తిరువనంతపురంల ఒక పైవేటు దవాఖానల పని సేత్తాంది. ఇగ గా ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పిచ్చి, గత సోమారం ఉదయం మనువాడిండ్రు. పొద్దుమీకి గా పెండ్లి రిసెప్షన్ జరుగుతాంది. గప్పుడు మస్తుగ మందు తాగిన మైకంల గా కొత్త పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల తండ్రితోటి పంచాతి పెట్టుకున్నడు. గండ్లనే మాట మాటా పెరిగింది. మామను, అడ్డమొచ్చిన భార్యను కొట్టి ఎళ్లిపోయిండు. ఇగా తండ్రి, బిడ్డలు ఊకుంటారు? సక్కగ పోలీసు టేసన్ కు పోయిండ్రు. గాడ ఫిర్యాదు సేసిండ్రు. ఐటెంక, గా పెండ్లి తెగదెంపులు సేసుకున్నరు. !?

