సాంకేతికత సృష్టిస్తున్న అద్భుతాల మాటునే వినాశనపు ఛాయలు కమ్ముకుంటున్నాయి! ఒకవైపు ఏఐ దుర్వినియోగం.. మరోవైపు అణుయుద్ధ భయాలు.. వెరసి మానవాళి మనుగడకే పెను సవాలు! వీటికి తోడు వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొనకపోతే.. రాబోయే తరాలకు మిగిలేది అభివృద్ధి కాదు, అనిశ్చితి మాత్రమే!
మార్గం – అడుగు, ఎడిటోరియల్
సాంకేతిక విప్లవం ఒకవైపు మానవ జీవన ప్రమాణాలను సులభతరం చేస్తుంటే, మరోవైపు అదే వేగం భవిష్యత్తు తరాలకు గండంగా మారుతోంది. సరిహద్దుల్లో మోగుతున్న యుద్ధభేరీలు, ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటున్న అత్యాధునిక సాంకేతికతలు వెరసి ప్రపంచాన్ని పెను సంక్షోభం వైపు నెడుతున్నాయి. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) దుర్వినియోగం, సంభావ్య అణుయుద్ధం ఈ శతాబ్దంలో మానవాళి మనుగడకే ముప్పు తెచ్చిపెట్టగలవని లాన్సెట్ కమిషన్ నివేదిక హెచ్చరించడం ప్రపంచ దేశాలకు మేల్కొలుపు కావాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధిస్తున్న పురోగతి ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోందో, అంతకుమించి ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఏఐ సాంకేతికతను స్వార్థ శక్తులు జీవాయుధాల తయారీకి దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే విలయాన్ని ఊహించడం అసాధ్యం. మరోవైపు, దేశాల మధ్య ఉద్రిక్తతలు అణుయుద్ధానికి దారితీస్తే దాని పర్యవసానాలు హద్దులు దాటి ప్రపంచం మొత్తాన్నీ కబళిస్తాయి. అణు విస్ఫోటనాల వల్ల ఏర్పడే దట్టమైన ధూళి, పొగ ఆకాశాన్ని కమ్మేసి సూర్యకాంతిని అడ్డుకుంటాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయి, పంటలు పండక తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుందని 35 మంది అంతర్జాతీయ నిపుణులు వరల్డ్ హెల్త్ సమిట్లో సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది.
ఈ రెండు తీవ్ర విపత్తులతో పాటు పర్యావరణ మార్పులు, వాయు కాలుష్యం, పోషకాహార లోపం, కొత్త మహమ్మారులు, పేదరికం వంటి మరో 15 పెను సవాళ్లు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి మానవ ఆరోగ్యాన్ని కుంగదీస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించగలిగితే దాదాపు 189 కోట్ల ఆరోగ్యకర జీవిత సంవత్సరాల నష్టాన్ని కాపాడవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే అంతర్జాతీయ వైద్య సహాయ నిధుల్లో కోతలు పడితే, ముఖ్యంగా ఆఫ్రికా వంటి పేద దేశాల్లో కోట్లాది చిన్నారుల జీవితాలు అంధకారంలోకి జారుకుంటాయి. సంపన్న దేశాలు ఊబకాయం, మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతుంటే, పేద దేశాలు పోషకాహార లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
2100 నాటికి మానవాళి అంతరించిపోతుందని నివేదిక పూర్తిగా తీర్పు ఇవ్వనప్పటికీ, మేల్కొనకపోతే జరిగే నష్టం పూడ్చలేనిదని ఘంటాపథంగా చెబుతోంది. నేటి పాలకుల దృక్పథం, తీసుకొనే సాహసోపేత నిర్ణయాలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సరిహద్దు ఘర్షణలను పక్కనపెట్టి, ఏఐ నియంత్రణకు కఠిన అంతర్జాతీయ చట్టాలు తేవడం, నిరాయుధీకరణకు కట్టుబడటం, పర్యావరణ పరిరక్షణకు కదలడం తక్షణ కర్తవ్యం. ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత విలపించడం కంటే, ముందే మేల్కొని వినాశనాన్ని నివారించడమే విజ్ఞత.

