సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదా!?
భారత ప్రభుత్వం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నేరుగా తొలగించగలదా? అదంత సులభమా? సుప్రీం కోర్టు సీఈసీని తప్పుకోమనో, తప్పించమనో ప్రభుత్వాన్ని ఆదేశించగలదా? రాజకీయంగా కేంద్ర ప్రభుత్వమో లేక ప్రతిపక్షాలో సీఈసీని ఆ పదవి నుంచి తీసేయగలవా? అసలు సీఈసీకి ఉన్న రాజ్యాంగ రక్షణలేంటి? తొలగించే పద్ధతులేంటి?
-డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ
భారత ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలే పునాది. ఆ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం పదవి నుంచి తొలగించగలదా? అంటే.. సాధ్యం కాదు. ఈసీని తప్పించాలంటే, రాజ్యాంగం నిర్దేశించిన కఠినమైన ప్రక్రియను పూర్తి చేయాల్సిందే!
పార్లమెంటు ఆమోదం లేకుండా భారత ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించలేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తనంతట తానే రాజీనామా చేస్తే తప్ప సీఈసీని తొలగించడం ఏ ఒక్కరి తరమూ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ అత్యంత రక్షణ కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసేలా చూడటమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రివర్గం తమ ఏకపక్ష నిర్ణయంతో జారీ చేసే ఉత్తర్వు ద్వారా తొలగించలేరు. అలాగే కోర్టులు, నాయకులు, పార్టీలు కూడా సీఈసీని తప్పించలేవు. సీఈసీని తొలగించే తప్పనిసరి ప్రక్రియ ప్రత్యేకంగా రాజ్యాంగంలో రూపొందించబడింది.ప్రభుత్వం, ప్రతిపక్షాలు పార్లమెంటులో కఠినమైన, అనేక దశలతో కూడిన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.
రాజ్యాంగమే రక్షణ కవచం!
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సీఈసీని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నిర్ణీత ప్రత్యేక పద్దతిలోనే తొలగించాల్సి ఉంటుంది. సీఈసీ లేదా న్యాయమూర్తి దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైనప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి సిఫారసు, కేంద్ర మంత్రివర్గ నిర్ణయం లేదా రాష్ట్రపతి ఏకపక్ష ఉత్తర్వులు సరిపోవు. రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియ తప్పనిసరి.
ఇదీ తొలగింపు ప్రక్రియ!
తొలగింపు ప్రక్రియ ప్రారంభించడానికి ముందు లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన తీర్మాన నోటీసు ఇవ్వాలి. లోక్ సభ సభాపతి లేదా రాజ్యసభ ఛైర్మన్ దానిని పరిశీలించి ఆమోదించవచ్చు. లేదా తిరస్కరించవచ్చు. నోటీసు ఇవ్వడమే తొలగింపునకు హామీ కాదు. అది విచారణకు వెళ్లాలంటే ముందుగా రాజ్యసభ చైర్మన్/స్పీకర్ ఆమోదం పొందాలి.
ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ
నోటీసు ఆమోదం పొందిన తర్వాత ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఆరోపణలపై విచారణ జరుపుతుంది. కమిటీలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీ ముందు ఆరోపణలు నిరూపితం కాకపోతే తదుపరి తొలగింపు ప్రక్రియ ముందుకు సాగదు. నిరూపితమైతేనే పార్లమెంటులో తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది.
ప్రత్యేక మెజారిటీ ఉండి తీరాలి!
తొలగింపు తీర్మానం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. అంటే ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీతో పాటు, హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలి. ఈ ఆమోదం ఒకే సమావేశ కాలంలో రావాలి. అనంతరం ఉభయ సభలు రాష్ట్రపతికి తొలగింపు వినతిని సమర్పిస్తాయి. రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వు జారీ చేసినప్పుడే ప్రక్రియ పూర్తవుతుంది.
రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా ఉండాలి!
సీఈసీ లేదా న్యాయమూర్తుల తొలగింపునకు ఈ కఠిన నిబంధనల ఉద్దేశం సీఈసీకి లేదా న్యయమూర్తులకు అపరిమిత అధికారాలు కల్పించడం కాదు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేసేలా రక్షణ కల్పించడం. అదే సమయంలో, ఎన్నికల నిర్వహణపై విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఆధారాలతో పరిశీలించడం కూడా అవసరమే. రాజకీయ అసమ్మతి ఒక్కటే తొలగింపునకు కారణం కాకూడదనేది ఈ కఠిన నిబంధనల ఉద్దేశ్యం.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం సాధారణ పరిపాలనా నిర్ణయం కాదు. కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యుల మద్దతుతో ప్రారంభమయ్యే ప్రక్రియ. ప్రత్యేక కమిటీ న్యాయ విచారణ, ఆధారాలతో నిరూపితం, ఆమోదం, రెండు సభల్లో ప్రత్యేక మెజారిటీ, రాష్ట్రపతి ఉత్తర్వు వంటి కీలక దశలను దాటాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ రక్షణ వ్యక్తి కోసం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి కూడా. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత, జవాబుదారీతనం కలిసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుంది.


