మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల… గిట్ల గీ పోస్టాపీసులన్నయి. గయన్ని ఎక్కడెక్కడున్నయో ఓ పారి సూసొద్దామా?
గిది నీటి మీద తేలాడే పోస్టాపీసు. గిది జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ ల ఉన్న దాల్ సరస్సు మీద ఉంది. గిదీన్ని బ్రిటీష్ కాలంలనే పెట్టిండ్రు. 2011ల గిదీన్ని మల్లోపాలి లాంచ్ చేసిండ్రు.
గిది నీల్ల లోపల పోస్టాపీసు. వనువాట్ హైడ్ అవే రీసార్ట్ నుండి 50 మీటర్ల దూరంల 3 మీటర్ల లోతుల నీల్ల లోపల పోస్టాపీసు ఉంది. గిండ్ల నీల్లల్ల తడవని, గదే నుల్లా.. వాటర్ ప్రూప్ పోస్టు కార్డులను వాడ్తరు.
గిదేమో ఎత్తైన పోస్టాపీసు. హిమాచల్ ప్రదేశ్ ల హిక్కీస్ పీత్ వ్యాలీల ప్రపంచంలనే ఎత్తైన పోస్టాపీసు ఉంది. సముద్ర మట్టానికి గిది 14,400 అడుగుల ఎత్తల ఉంది.

గిది కొబ్బరి బొండంల పోస్టాపీసు. హవాయిల ఉన్న మెలోకై ఐ ల్యాండ్ ల కొబ్బరి బొండాం పోస్టాపీసు ఉంది. గీడ బొండాంలు కొని దాని మీద పెయింటింగ్ యేసి టాంపులంటిత్తరు.
ఇగ గిదో గమ్మత్తైన పోస్టాపీసు. అమెరిక హరిజోనాల గ్రాండ్ కెనాన్ లోయల సుపాయి పోస్టాపీసు ఉంది. గాడికి గాడిద, గుర్రంలతో పుట్టిన సంకర జాతి మ్యూల్ ల మీద మోసుకపోతరు.
గిది రైలు పట్టాల దారిల ఉన్న పోస్టాపీసు. 24కి.మీ. పొడువున్న స్లోవేయిలాలోని పోస్టోజున గుహల్ల రైలు దారితోపాటు ఒక పోస్టాపీసు ఉంది. గిదీన్ని కెవర్నస్ పోస్టాపీసు అంటరు.
ఒకప్పుడు ఈఫిల్ టవర్ మొదటి అంతస్తుల కూడా పోస్టాపీసు ఉండేదట. గమ్మత్తుగున్నయి కదా గీ పోస్టాపీసులు?

