అవుమల్ల.. కుక్కలకు కాలం చెల్లాలని ఒకకెల్లి ఆందోళనలు చెలరేగుతున్నయి. మరోకెల్లి గా ముధోళ్ ల గా జాగిలాల కాలమే నడుత్తాంది. గిదేందనుకుంటున్నరా? నిజమేనుల్లా…
కుక్కలతోటి మనుసులది యిడదీయరాని అనుబంధం. మనిసితోటే కుక్కలు కూడా ఎదిగినయి. ఇగిప్పుడైతే మనిసి యిశ్వాసం పోగొట్టుకుంటుండటంతోటి, ఇంకా గా కుక్కలకు మిగిలి ఉన్న యిశ్వాసం కారణంగా గవాటికి డిమాండ్ కూడా బాగా పెరుగుతాంది. గుందుకే దేశం లెక్కల్ల కర్ణాటక ముధోళ్ కుక్కలకు జనంల ఆదరణ ఎక్కువైతాంది. పెరుగుతున్న నేరాలను, ఘోరాలను అరికట్టేటందుకు, తమను కాపాడుకునేటందుకు ఎవలకు వాళ్ళు కుక్కల్ని పెంచుకోబట్టిరి. ఇగైతే దేశంల అన్ని భద్రత బలగాలకు గా కర్ణాటక ముధోళ్ జాతి శునకాలనే యినియోగిస్తున్నరు. గా కశ్మీరు ఉగ్రవాదులు, గీ ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులు, గా మావోయిస్టుల యేటల గివీటినే వాడుతున్నరు. ఇగ గీ గుర్తింపును సూసి గా రాష్ట్ర సర్కార్ గివీటి పోషణకు ఆసక్తి చూపుతాంది.

ఇగ గీ శునకాలు చిరుత పులుల లెక్క శత్రువుల్ని చీల్చి చెండాడుతయట. ఇగ గియంటే గా చైనా, పాకిస్తాన్ సైనికులకు ఉచ్చ పడ్తదట. గందుకే గా సర్కార్ గీ ముధోళ్ జాతి కుక్కల్ని సంరక్షించటానికి బాగల్కోటెలో ఓ కేంద్రాన్ని పెట్టిందట. ఇగ గీ ముధోళ్ తాలూకాల అన్ని ఊర్లల్ల ప్రాచీనకాలం నుండే గీ గ్రామసింహాలను పెంచి పోషిస్తున్నరు. గప్పట్ల గా శివాజీ మహారాజు తన కోటకు గీ కుక్కలనే కాపలాగా పెట్టుకునేటోడట. గీ శునకాలు నాలుగు రంగుల్ల ఉంటయట. గివీటి జీవిత కాలం 10 నుంచి 12 ఏండ్లట. యేటకు దిగితే శత్రువును సంపుడా? సచ్చుడా? అన్నట్లే పోరాడతయట. గివీటిని యెయ్యి కుటుంబాలు పెంచుతానయట. ఇగ గివీటిని కొనాలంటే యేల రూపాయలైతయట. కుక్కల కాలం వచ్చినట్లే కదా?

