ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన భారత నిర్మాణం దిశగా దేశం ముందుకు సాగాలి. అదే అగ్రరాజ్యంగా ఎదగాలనే భారత ఆకాంక్షకు బలమైన పునాది!
మార్గం – అడుగు, ఎడిటోరియల్
ప్రపంచ రాజకీయ, ఆర్థిక, రక్షణ, సాంకేతిక, దౌత్య రంగాల్లో భారత్ తనదైన ముద్ర వేస్తూ అంతర్జాతీయంగా ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. భారతదేశం అంటే ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా మారుతున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన అంతర్జాతీయ నివేదికలు దేశ ప్రగతిని మరోసారి చాటుతున్నాయి.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్–2026’ నివేదికలో భారత్ ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. మొత్తం 27 దేశాలు, ప్రాంతాలను 131 సూచికల ఆధారంగా విశ్లేషించిన ఈ నివేదికలో భారత్ 100కు 40.5 పాయింట్లు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 0.5 పాయింట్లు పెరగడం విశేషం. అమెరికా 78.9, చైనా 73.6 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2018లో ఈ సూచీ ప్రారంభమైనప్పటి నుంచి చైనాతో భారత్‌కు ఉన్న శక్తి అంతరం అత్యల్ప స్థాయికి చేరిందని నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ చైనా సమగ్ర శక్తి భారత్ కంటే 80 శాతం అధికంగా ఉందని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న దౌత్యపరమైన ప్రభావాన్ని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకుల అంచనాలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నెంబర్ వన్ గా నిలవగా, మోదీ రెండో స్థానంలో నిలిచారు. ముఖ్యంగా దౌత్య సంబంధాలు, భవిష్యత్ ఆర్థిక అవకాశాలు, రక్షణ సహకారం, సాంస్కృతిక ప్రభావం వంటి రంగాల్లో భారత్ తన స్థాయిని మెరుగుపరుచుకుంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలతో రక్షణ సంబంధాలు, బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతులు భారత్ రక్షణ నెట్వర్క్ ను బలోపేతం చేశాయి. సాంస్కృతిక ప్రభావం 43.8 పాయింట్లకు చేరగా, దౌత్యపరమైన ప్రభావం 70.3 పాయింట్లుగా నమోదైంది.
అయితే, ఈ ప్రగతి ప్రయాణంలో సవాళ్లూ లేకపోలేదు. రూపాయి విలువలో బలహీనత, విదేశీ పెట్టుబడుల్లో 20 బిలియన్ డాలర్ల తగ్గుదల, ఆర్థిక సామర్థ్యానికి సంబంధించిన సూచికల్లో స్వల్ప క్షీణత వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దౌత్యపరమైన చురుకుదనాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా సూచించింది.
మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛను సూచించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్–2026లో భారత పాస్‌పోర్టు 84వ స్థానంలో ఉంది. భారతీయులు ముందస్తు వీసా లేకుండా లేదా నిర్దిష్ట ముందస్తు వీసా విధానం లేకుండా 55 గమ్యస్థానాలకు వెళ్లగలుగుతున్నారు. సింగపూర్ 193 గమ్యస్థానాలతో మొదటి స్థానంలో ఉండగా, జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. పాస్‌పోర్టు ర్యాంకింగ్‌లో స్థానం, ప్రయాణ సౌలభ్యం రెండూ వేర్వేరు అంశాలని గుర్తించాలి.
అమెరికా, చైనా మధ్య పోటీ కూడా ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారుతోంది. ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం ఈ రెండు దేశాల మధ్య కేవలం 5.3 పాయింట్ల అంతరం మాత్రమే ఉంది. ఇది 2018 నుంచి నమోదైన అత్యల్ప వ్యత్యాసం.
ఏది ఏమైనా, ప్రపంచంలో భారత్ తన ఆర్థిక, సైనిక, సాంకేతిక, దౌత్య సామర్థ్యాలను మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. యువశక్తి, నైపుణ్యం, ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ సహకారాన్ని సమర్థంగా వినియోగించుకుంటే భారత్ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలదు. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన భారత నిర్మాణం దిశగా దేశం ముందుకు సాగాలి. అదే అగ్రరాజ్యంగా ఎదగాలనే భారత ఆకాంక్షకు బలమైన పునాది!

