యెన్కటికి యిద్దె అంటే గురువు. గురువు శెప్పిందే యిని నేర్సుకునేది. సూపింది సూసి, సేసి తర్పీదు పొందేది. ఇగ తర్వాత్తర్వాత గది పాయే, సారు శెప్పే సదువు కానించి, సారు లేకుండనే సదువుకునే దాకా వచ్చె. ఇగేం కావాల్నన్నా గూగుల్ తల్లి ఉండనే ఉండె. ఇంకా జెమిని, చాట్ జీపీటీ, ఏఐలు రానే వచ్చె. గియన్నీ గాకుండ, ఒకసారు ఇంటిని, గోడల్నే బడి లెక్క కాదుల్లా ఏకంగా సారు సెప్పే సదువులెక్క, ఓ మ్యూజియం లెక్క మార్సిండు. గదేందో సూద్దాం పదండ్రి.

గిది ఆంద్రప్రదేశ్ రాస్ట్రం, బాపట్ల జిల్ల పేటేరు ఊరు. ఇంగ్లీష్ సెప్పే సారు యార్లగడ్డ పోలీసు అనేటాయినె, పదవీ విరమణ శేసిండు. ఇగ తన ఇంటినే ఇంగ్లీష్ మ్యూజియం లెక్క మార్సిండు. ఇగ గా ఇంట్ల అడుగె పెడితే సాలు, ఇంగ్లీష్ అచ్చరాలు రారమ్మని పిలుత్తయి. గోడలు, మెట్లు, పై కప్పు, మొగురాలు, తలుపులు, కిటికీలు గిట్ల.. ఎక్కడ సూసినా, ఇంగ్లీష్ అచ్చరాలు, గ్లామర్ ఫార్ములాలే అగుపిత్తయి. ఇంగ్లీష్ ను అల్కగ నేర్సుకునే పద్ధతులే అవన్నీ. ఇగ పొల్లగాండ్లకు గా బాస మీద భయం పోగొట్టి, సులువుగ నేర్సుకోవడానికే గిట్ల శేసిన అంటాండు గా సారు.

