ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు, కుంటలను కాపాడుకోవడం కాలానుగుణ అవసరాలు. ప్రకృతి విపత్తు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధపడటం మేలు. నీటి వనరులను కాపాడుకుంటేనే వ్యవసాయం, గ్రామీణ జీవనం, భవిష్యత్ తరాల నీటి భద్రతకు భరోసా లభిస్తుంది. ఎల్‌నినో హెచ్చరికను కేవలం వాతావరణ వార్తగా కాకుండా, జల సంరక్షణకు మేల్కొలుపుగా భావించాలి.!
మార్గం – అడుగు, ఎడిటోరియల్
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్న వేళ ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశాలు ఉండటం అప్రమత్తం కావాల్సిన అంశం. 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో అసమతుల్యత ఏర్పడటం, కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. అయితే ఈ ప్రభావాలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల వాతావరణ అంచనాలను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు చర్యలు చేపట్టడం అత్యవసరం.
ఎల్‌నినో సహజ వాతావరణ పరిణామమే అయినప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం దాని పరిణామాలను మరింత తీవ్రంగా మార్చే అవకాశం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, ప్రజారోగ్యం, ఆర్థిక కార్యకలాపాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోతే రైతులు పంటల సాగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూగర్భ జలాలపై ఆధారపడే రైతులకు సాగునీటి కొరత మరింత భారంగా మారుతుంది. తాగునీటి అవసరాలు తీర్చడం కూడా సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో నీటి ప్రతి చుక్కను సమర్థంగా వినియోగించుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలి.
తెలంగాణలో ఈ సమస్యకు చెరువులు, కుంటల పరిస్థితి మరింత ప్రాధాన్యం కల్పిస్తోంది. ఒకప్పుడు గ్రామీణ వ్యవసాయానికి, పశువుల అవసరాలకు, భూగర్భ జలాల పెరుగుదలకు ప్రధాన ఆధారంగా నిలిచిన చిన్న నీటి వనరులు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ విస్తరణ, ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం, నిర్వహణ లోపాలు వాటి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన ఏడో చిన్న నీటిపారుదల గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఉపరితల జల పథకాల సంఖ్య 2017-18లో 1,00,619 ఉండగా, 2023-24 నాటికి 94,370కు తగ్గింది. ఆరేళ్లలో సుమారు 6.2 శాతం తగ్గుదల నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇదే సమయంలో భూగర్భ జల పథకాలపై ఆధారపడటం పెరుగుతుండటం భవిష్యత్తులో నీటి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రభుత్వం చెరువులు, కుంటల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆక్రమణలను తొలగించడం, పూడిక తీయడం, వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయడం, చెక్‌డ్యాంలను పటిష్ఠం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామస్థాయిలో నీటి వనరుల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. రైతులకు తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పద్ధతులపై అవగాహన కల్పించాలి. బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు వర్షపు నీటి సంరక్షణను ఉద్యమంగా మార్చాలి. ప్రజలు కూడా నీటి వృథాను తగ్గించి, స్థానిక జల వనరుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.
ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు, కుంటలను కాపాడుకోవడం కాలానుగుణ అవసరాలు. ప్రకృతి విపత్తు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధపడటం మేలు. నీటి వనరులను కాపాడుకుంటేనే వ్యవసాయం, గ్రామీణ జీవనం, భవిష్యత్ తరాల నీటి భద్రతకు భరోసా లభిస్తుంది. ఎల్‌నినో హెచ్చరికను కేవలం వాతావరణ వార్తగా కాకుండా, జల సంరక్షణకు మేల్కొలుపుగా భావించాలి.

