మంత్రి వర్గమా! మా గోడు వినుమా!!
ఏడాది దాటింది… ఏమీ చేయలేకపోతున్నామయ్యా!?
-సమీక్షలు చేయాలంటే సచ్చిపోతున్నాం
-క్షేత్ర స్థాయి పర్యటనలు కన్నీటి పర్యంతం
-అధికారులు మా ఫోన్లు ఎత్తడం లేదు
-పోలీసులు మా మాట వినడం లేదు
-కాసులు లేక కాంట్రాక్టర్లు పనులు చేయడంలేదు
-ఏ పనులూ అవడం లేదని కార్యకర్తలు అడుగుతున్నారు
-అభివ్రుద్ధి పనులు కావాలని ప్రజలు తిరగబడుతున్నారు
-గతంలోలా సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదు
-మంత్రుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు
-పది సార్లు కలిసినా ఒక్క పనీ కావడంలేదు
-మేమంటేనే మంత్రులకు చిన్న చూపు.. ఛీత్కరింపు
-జనం అడిగితే జవాబు చెప్పలేకపోతున్నాం
-వచ్చేది ఎండా కాలం… జనం మండే కాలం
-మంచినీరు, కరెంటు సమస్యలకు మంచి దారులు చూపండి
-ప్రజాపాలనలో ప్రజల ముందు తలెత్తుకునేలా చేయండి
-నిధులు పెంచడం. ప్రగతికి పంచడంపై ద్రుష్టిసారించండి
-అమాత్యులూ ఆలకించండి… అన్యదా భావించకండి
-కేబినెట్ భేటీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా…
-ఇదీ ఎమ్మెల్యేల మనో వేదన
అయ్యా ముఖ్యమంత్రి గారూ…!
అయ్యా మంత్రివర్యుల వారూ…!!
కొత్త ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తైంది. ప్రాథామ్య పథకాల ప్రారంభం కూడా జరిగిపోతున్నది. కానీ, నిరంతర అభివృద్ధి, సాధారణ పాలన పడకేస్తున్నది. నిధులు లేక, విధులు ఉడిగి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేని వైచిత్రిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తమ సన్నిహితులతో అన్యాపదేశంగా అంటున్న మనోవేదన మాటలనే వాళ్ళ మనోగతంగా అందిస్తున్న ‘అడుగు ‘ ప్రత్యేకం.
పదేండ్ల బిఆర్ఎస్ పరిపాలన మీద విసిగి వేసారిన ప్రజలు మా పార్టీలు, పనిలో పనిగా స్థానికంగా మేం ఇచ్చిన ఎన్నో హామీలతో మరెన్నో ఆశలతో కాంగ్రెస్ కు అధికారం అందించారు. మీరే చెప్పినట్లు తీరా చూస్తే లంకె బిందెల బదులు… ఖాళీ బిందెలే దర్శనమిచ్చాయి. ఖానా, పీనా, గానా భజానాకు కూడా సరిపోని ఖాళీ ఖజానాతో నయా జమానా నడపడం అంత ఈజీ కాదు. కానీ, మీరు ఎంతో నేర్పుతో, ఓర్పుతో, కూర్పుతో సర్కార్ ని నడిపిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా లెక్కబెట్టి మరీ నేరవేరుస్తున్నారు. అబినందనీయం. అభివృద్ధి అంటే పార్టీలు ఇచ్చిన హామీలు మాత్రమే కాదు కదా, విడివడని అనేక అంశాలతో ముడిపడి వుంది. ఆరు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండదన్న ప్రతిపక్ష ప్రతికూల ప్రేలాపనలకు విలాపం కలిగిస్తూ… విజయోత్సవాలు, అభినందన సభలు, సత్కారాలు, సన్మానాలతో మేం గెలిచిన ఆరు నెలలు హ్యాపీగా, హాయిగా, హానీ మూన్ లా గడిచిపోయాయి. ఇక అసలు సినిమా ఆతర్వాతే మొదలైంది. అప్పుడే ఏడాది గడిచేపోయింది. చేయాల్సింది ఎంతో ఉంది. చూడాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిజమే. కానీ ప్రభుత్వ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పని చేయడమే కష్టంగా మారింది సార్!.
మాలో సగం మందికి అసెంబ్లీకి కొత్త. పాతవారిలో కొందరికి ప్రభుత్వం, మరికొందరికి పరిపాలన కొత్త. కొత్తాపాతల మేలు కలయికలో రోజులు గడుస్తున్నా కొద్దీ… రేపటి రోజులు, పగలే చుక్కలు, నిద్రలేని రాత్రులు కనిపిస్తున్నాయి. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఏమీ చేయలేకపోతున్నాం. మా ఫోన్లు కూడా ఎత్తని అధికారులకు ఆదేశాలివ్వడమే తప్ప..వివిధ శాఖలు, సమస్యలపై సమీక్షలు చేయాలంటే సచ్చిపోతున్నాం. అక్కడికక్కడే పరిష్కరించలేని ప్రజల ప్రశ్నలతో క్షేత్ర స్థాయి పర్యటనలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. మా మాట వినని పోలీసులను మా రక్షణకే తప్ప, ప్రజారక్షణకు ప్రయోగించలేకపోతున్నాం. ఇక గత సర్కార్ ఇచ్చిన లెక్కలేనన్ని ప్రొసీడింగ్స్ తో, హడావుడిగా మొదలు పెట్టిన పనులకు కాసులు లేక కాంట్రాక్టర్లు పని చేయడంలేదు. పైగా రేట్లు పెంచి రివైవ్ చేయాలని పట్టుపడుతున్నారు. ఇదంతా కక్కాలేకా మింగా లేక ఛస్తున్నాం. ఇక ఏ పనులూ అవడం లేదని కార్యకర్తలు అడుగుతున్నారంటే కాస్త గౌవరం. నిలదీస్తున్నారంటే అవమానం. మరోవైపు అభివృద్ధి పనులు కావాలని ప్రజలు తిడుతున్నారు. దాదాపు తిరగబడుతున్నారు సార్!.
గతంలోలా సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదు. సీఎంఓలో అడిగితే, అడిగి చెబుతామంటారు. మళ్ళీ చేస్తే ఫోన్ కూడా ఎత్తరు. నేరుగా వెళ్ళడమే. మంత్రుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పది సార్లు విజ్ఞాపనలు ఇచ్చినా ఒక్క పనీ కావడంలేదు! ఎందుకో మేమంటేనే మంత్రులకు చిన్న చూపు… ఛీత్కరింపు. వాళ్ళకి మాకు ఏంటీ తేడా? ఒక్క మెట్టే కదా! సీఎం గారు ఒక్క ఛాన్స్ ఇస్తే మేమూ మంత్రులమే కదా? ఇవ్వకపోతే, వారూ మాలాగే ఎమ్మెల్యేలే కదా? అయినా, మంత్రులకు వారి శాఖల వారీగా రూ.500 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు ఇచ్చారని వింటున్నాం. మంత్రులు ఎవరి దుకాణాలు వారు తెరుచుకున్నారు. వాటి వాసన కూడా మాకు తెలియదు. అడుక్కున్నా, ఎంగిలి మెతుకులు కూడా విదల్చడం లేదు. వాళ్ల పనులన్నీ ఏంచక్కా చక్కబెట్టుకుంటున్నారు. వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అందులోంచో, మరెందులోంచో, చివరకు మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచో, ఎంతో కొంత ఇస్తే మీ లాగే మేం కూడా మా పనులు చేసుకుంటాం కదయ్యా! మేమూ మీ లాగే ఖర్చుల పడి ఉంటిమి. జనం అడిగితే జవాబు చెప్పలేకపోతున్నామయ్యా! ముఖం చాటేసి తిరుగుతున్నాం!!
పోనీ, మెమో నలుగురం కలిసి మా కష్టసుఖాలు పంచుకుందామంటే గుంపు కట్టినమని, అసమ్మతని, రెబెల్స్ అని, తిరుగుబాటని, తిరుగుబావుటా అనీ అనబడితిరి. నిఘా నీడల మధ్య నికార్సుగా ఉండలేక పోతున్నాం. ఇంక ఎవరికి చెప్పుకోవాలి సార్ మా గాథలని, బాధలని.
అయ్యా! వచ్చేది ఎండా కాలం… జనం మండే కాలం. గుండెలు చెరువులు కాకుండా గతంలోలా ఊళ్ళల్లో మా చెరువులు నింపి, మా నియోజకవర్గాలలో మంచినీరు, కరెంటు సమస్యలు లేని, రాని మంచి దారులు చూపండి. ప్రజా పాలనలో ప్రజల ముందు తలెత్తుకునేలా చేయండి. నిధులు పెంచడం. ప్రగతికి పంచడంపై దృష్టి సారించండి. అమాత్యులూ ఆలకించండి… అన్యదా భావించకండి. మా ఆవేదన అరణ్య రోదన కాకుండా చూడండి.
కృతజ్ఞతలు! ధన్యవాదాలు!!
పార్టీలు, ప్రాంతాలు, జిల్లాలు, నియోజకవర్గాలకు అతీతంగా…
మీ
-ఎమ్మెల్యేలు

