బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా?
ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్
రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది?
మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా?
రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి!
ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో?
అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో రామచంద్రా? అనే పరిస్థితులు దాపురించాయి. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే టాప్ గా ఉన్న మన రాష్ట్రం, బియ్యం ధరల నియంత్రణలో ఫ్లాప్ గా మారింది. ఇది మిల్లర్ల మాయా? లేక ప్రభుత్వ ప్రజా పరిపాలన వైఫల్యమా? రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటు ధరలేవి? మన రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ఉండటం ఒక విషమ పరిస్థితికి నిదర్శనం కాగా, ధరల పెరుగుదలకు దరిద్రపుగొట్టు కారణాలెన్నో? ఉన్నాయి. పెరుగుతున్న బియ్యం ధరలపై ‘అడుగు’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.
హైదరాబాద్, అక్టోబర్ 6 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది సామాన్యుడి పరిస్థితి. ఇప్పటికే ఉప్పు, పప్పులు, నూనెలు,వంటి నిత్యావసరాల ధరలు కుటుంబ బడ్జెట్‌ను కుదేలు చేస్తుండగా, ఇప్పుడు బియ్యం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. తెలంగాణలో సన్న రకాల బియ్యం కొన్ని మార్కెట్లలో కిలో రూ.80– రూ.90 వరకు పలుకుతుండగా, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సాధారణ బియ్యం సగటు రిటైల్ ధర జూలైలో రూ.54.40 నుంచి సెప్టెంబరులో రూ.61.60కు చేరింది. మూడు నెలల్లో 13.32 శాతం పెరుగుదలతో తెలంగాణ దేశంలో రెండో అత్యధిక ధర పెరుగుదల నమోదైన రాష్ట్రంగా నిలిచింది.
ధరల పెరుగుదలకు కారణాలెన్నో?
అయితే, ఈ పెరుగుదల వెనుక ఒక్క కారణమేమీ లేదు. సన్న ధాన్యానికి పెరిగిన డిమాండ్, ప్రభుత్వ సేకరణ, వాతావరణ అనిశ్చితి, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు, మిల్లింగ్, రవాణా ఖర్చులు ఇవన్నీ కలిసి ధరను పైపైకి తీసుకెళుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో దిగుబడులు తగ్గవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లో ముందస్తు కొనుగోళ్లకు దారితీశాయి. తాజా మార్కెట్ నివేదికల ప్రకారం ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.3,300కు, బీపీటీ రూ.2,400 నుంచి రూ.3,000కు పెరిగింది. అంటే వరుసగా దాదాపు 38 శాతం, 25 శాతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తున్నది.
ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్
ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ దేశంలో ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటి. అయినా ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రంలోనే వినియోగదారుడికి బియ్యం ఖరీదవుతోంది. కారణం ఉత్పత్తి పరిమాణం మాత్రమే కాదు. ఏ రకం ధాన్యం ఎంత పరిమాణంలో, ఎక్కడికి, ఏ ధరకు వెళ్తోంది? అన్నదే కీలకం. నల్లగొండ, యాదాద్రి భువనగిరి వంటి ప్రాంతాల్లో సన్న రకాలపై మిల్లర్లు, వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని చోట్ల సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.3,200–రూ.3,300 వరకు చెల్లిస్తున్నట్లు తాజా మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి.
సర్కార్ బోనస్ ఈ 7 రకాలకే..
రైతుకు మంచి ధర రావడం మాత్రం తప్పుపట్టాల్సిన విషయం కాదు. పైగా ప్రభుత్వం సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి సోనా, జైశ్రీరాం, కెఎన్ఎం 1638, వరంగల్ 44, కెఎన్ఎం 7715 వంటి ఏడు రకాలకు ఈ బోనస్ వర్తిస్తోంది. 2026-27 ఖరీఫ్‌లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ, రాష్ట్రంలో 8,283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.
గిట్టుబాటు-అందుబాటేది?
అయితే, రైతుకు లభించే కాస్త ఎక్కువ ధర వినియోగదారుడికి ఎందుకు అధిక బియ్యం ధరగా మారుతోంది? ఇదే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. రైతుకు గిట్టుబాటు ధర రావాలి. వినియోగదారుడికి అందుబాటు ధరలో బియ్యం దొరకాలి. ఈ రెండింటి మధ్య సమతౌల్యాన్ని సాధించడం పాలకుల బాధ్యత.
మిల్లర్ల మాయేనా?
అక్రమ నిల్వలు, ప్రభుత్వ ధాన్యం దారి మళ్ళడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి ఆరోపణలు కూడా తేలికగా తీసుకోలేం. నల్లగొండలో ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నిల్వల్లో అవకతవకల ఆరోపణలపై సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిణామాలు నిజమైతే అవి కేవలం ప్రభుత్వానికి నష్టం కాదు. చివరకు వినియోగదారుడి జేబుకే చిల్లు.
దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి!
మరోవైపు కేంద్ర స్థాయి గణాంకాలు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి. అక్టోబర్ 6న దేశ సగటు రిటైల్ ధర కిలోకు రూ.46.50గా ఉండగా, ఏడాది క్రితం రూ.43.14తో పోలిస్తే 7.8 శాతం ఎక్కువ. హోల్‌సేల్ ధర కూడా ఏడాదిలో క్వింటాల్‌కు రూ.3,852.82 నుంచి రూ.4,201.27కు పెరిగింది.
అందువల్ల మొత్తం భారాన్ని రైతుపై మోపడం ఎంత తప్పో, వ్యాపారులపై విచక్షణారహితంగా నిందలు వేయడం కూడా అంతే తప్పు. ప్రభుత్వం ఉత్పత్తి, సేకరణ, నిల్వలు, మిల్లింగ్, ఇతర రాష్ట్రాలకు తరలింపు, రిటైల్ ధరల మధ్య పూర్తి సరఫరా వ్యవస్థలను పర్యవేక్షించాలి. ప్రతి దశలో ధర ఎంత పెరుగుతుందో ప్రజలకు పారదర్శకంగా తెలియాలి. అవసరమైతే బఫర్ స్టాక్ విడుదల చేసి ధరలను నియంత్రించాలి.
పాలనా వైఫల్యమేనా?
బియ్యం సామాన్యుడికి విలాస వస్తువు కాదు. అది ప్రతి రోజు వంటింటికి చేరాల్సిన ఆహారం. కాబట్టి ధరల పెరుగుదలను కేవలం ‘మార్కెట్ పరిణామం’గా కొట్టిపారేయడం పాలనా వైఫల్యమే. రైతుకు గిట్టుబాటు ధర, మిల్లర్‌కు న్యాయమైన మార్జిన్, వినియోగదారుడికి అందుబాటు ధర.. ఈ మూడింటినీ సమన్వయం చేయాలి.
బియ్యం ధర పెరగడం ఒక కుటుంబ సమస్యగా కనిపించినా, అది వాస్తవానికి ఆహార భద్రత, ద్రవ్యోల్బణం, మార్కెట్ నియంత్రణకు సంబంధించిన పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని సరఫరా గొలుసులోని లొసుగులను మూసివేయాలి. లేదంటే ధర ఉడుకుతూనే ఉంటుంది.. బియ్యం రేటు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను కాల్చేస్తూనే ఉంటుంది!

