తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు కట్టంగుంటది. గౌడన్న మోకు కట్టుకొని, పానాలు అరశేతుల్ల పెట్టుకొని, శెట్టెక్కి, కల్లు గీత్తడు, ఒడుత్తడు. కొన్ని సార్ల పడి అవిటివాల్లై, పానాలు పోగొట్టుకున్నోల్లు కూడా ఉంటరు. ఇగ గిసొంటి పానాపాయానికి పుల్ స్టాపు పెట్టేటట్లు.. ఓ మంచి ఉపాయం శేసిండో గౌడన్న… గదేందో మీరే సూడుండ్రి.

గీ గౌడన్న పేరు మహేందర్. గీయినె తెలంగాణల, జనగాం జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్నుల ఉంటడు. తాటిశెట్లెక్కి కల్లు గీత్తడు. ఇగ గీయినెక్కే తాటి శెట్టుకు ఇనుప సువ్వలతోటి మెట్లు శేసిండు. గవాటికి ఓ నిచ్చెనేసిండు. గాపైన జారి పడకుండ, సుట్టూ కంచెలెక్క ఇనప తీగెలను సుట్టిండు. ఇగ మిద్దెలనెక్కినట్లే దబాదబా గా తాటి శెట్టునెక్కుతాండు. కల్లు గీత్తాండు. ఒడుత్తాండు. అడిగినోల్లకు, వాడికలోల్లకు పోత్తాండు. మంచిగుంది కదా గీ ఐవుడియా!?

