(ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహమ్: 18-24 నవంబర్ 2026)
వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు, పరాన్నజీవులు వాటిని చంపటానికి ఉద్దేశించిన మందులకు తట్టుకొని మనగలగటమే ఆంటీ మైక్రోబియల్ నిరోధకత (ఎఎంఆర్). ఫలితంగా మనుషులు, జంతువులు మరియు మొక్కలలో వచ్చే సంక్రమణ వ్యాధులు ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే మందులకు లొంగని బ్యాక్టీరియా వల్ల ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల మానవ మరణాలు సంభవిస్తున్నాయి. సత్వరచర్యలు చేపట్టక పోతే భవిష్యత్తులో ఈ మరణాలు మరింత ఆందోళనకర స్థాయికి చేరవచ్చు.
ఇతర కారణాలతో పాటు విచక్షణారహిత ఆంటీ మైక్రోబియల్ వాడకం ఈ సమస్యను జఠిలం చేస్తున్నది. 2015లో ప్రపంచ ఆరోగ్య విధానసభకు అధ్యక్షత వహించిన భారత్ సూచన మేరకు ఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహం (డబ్ల్యూఎఎడబ్ల్యూ) ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఎచ్ఓ) సహా ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఓఏఎచ్), ఐక్యరాజ్య పర్యావరణ పథకం (యూఎన్ఈపి), ఐక్యరాజ్య ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) లు “వన్ హెల్త్” అనే ఉద్గమంతో కలిసి పని చేస్తున్నాయి. వాటి సంయుక్త సచివాలయం ఈ 2026 సంవత్సరానికి “వన్ హెల్త్ వన్ యాక్షన్ : ప్రివెంట్ ఏఎంఆర్ నౌ” అనే నినాదాన్ని ఎంపిక చేసింది.
ఔషధాలను తట్టుకొనే వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాపిస్తే అవి మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలు, క్రమాభివృద్ధి అన్నిటి మీదా ప్రభావం చూపెడుతాయి. అటువంటి వ్యాధికారకాల జన్యత ప్రజారోగ్యం, పశు సంవర్ధనం, వ్యవసాయం, పర్యావరణ రంగాలలోని లొసుగుల వల్ల ప్రభావితం అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, పశు వైద్యులు, పర్యావరణ వేత్తలు, వ్యవసాయదారులు, పరిశోధకులు, సమాజాలు ఈ ఏఎంఆర్ ను నివారించే చర్యలు తీసుకొంటూనే ఉన్నారు. ఔషధాల లభ్యత, సహేతుక వినియోగం, సురక్షిత విసర్జన, నీటి సురక్షత, మురుగు పారుదల, పారిశుధ్యం, మంచి ఆహారం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్స్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంరక్షణ ఇట్లా ప్రతిదీ ముఖ్యమే! వ్యవసాయం, పశువైద్యం, పౌల్ట్రీ, ఆక్వా కల్చర్, ఆహార ఉత్పత్తి రంగాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు చేపట్టవలసిన చర్యలు చాలానే ఉన్నాయి. ప్రజల అవగాహన, బాధ్యత ముఖ్యమే.
ఆరోగ్య రంగానికి వస్తే అన్ని వైద్య కళాశాలల మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలోని కల్చర్ అండ్ సెన్సిటివిటీ నివేదికలు సిద్ధం చేయాలి. అన్ని వైద్యశాలల్లో ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పి ఫార్మసీ అండ్ తెరాప్యూటిక్ కమిటీలు (పిటిసి) ఏర్పాటు చేయాలి. పిటిసి పక్షాన ఆంటీ మైక్రోబియల్ ప్రిస్క్రిప్షన్ మార్గదర్శకాలు రూపొందించాలి. ప్రతి ప్రిస్క్రిప్షన్ ను క్లినికల్ ఫార్మసిస్ట్ పరిశీలన అనంతరం డిస్పెన్స్ చేయాలి. ఇట్లా సమగ్ర సమన్వయ కార్యకలాపాల ద్వారా ఆంటీ మైక్రోబియల్ నిరోధకత ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.


