Friday, November 13, 2026
23.4 C
Hyderabad

మగాడురా బుజ్జీ!?|TELANGANA|CM|REVANTH REDDY|NAGARJUNA AKKINENI

సీఎం సంధించిన ‘నాగార్జు‘నా’స్త్రం’
తెగిడిన నోటి నుండే పొగడ్తలు
సంఘర్షించకుండా సహకారం
అది మంచి పనేనని అంగీకారం
సీఎంకు, హైడ్రాకు చేకూరిన బలం
హైడ్రాకు ఆయనే బ్రాండ్ అంబాసిడరా?
కూల్చిన చోటే కొత్త రూపుదాల్చిన కుంట
ప్రారంభోత్సవంలో పల్లవించిన పలు అంశాలు

కాదన్న చోటే, అవుననిపించడం, అననుకూలతను సానుకూలతగా మలచడం, బాధితుడినే బాధ్యుడిగా మార్చడం, సంఘర్శించిన వారే సహకరించడం, తిట్టిన నోటితోనే పొగిడించుకోవడం, పొగడటం, ఒకే వేదికను పంచుకోవడం, అసాధ్యాలను సుసాధ్యాలు చేయడం వంటివన్నీ సాధారణ విషయాలేమీ కావు. ఇలాంటి అనేక దృశ్యాలు సదృశ్యంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట ప్రారంభోత్సవంలో ఆవిష్కృతమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డినేగాక, సినీ నటుడు నాగార్జునను కూడా విశేషంగా, ప్రత్యేకంగా నిలబెట్టాయి. రేవంత్ రెడ్డి సంధించిన ‘నాగార్జు‘నా’స్త్రం’ విపక్షాల, విమర్శకుల నోళ్ళు మూయిస్తుందా? హైడ్రాకు ప్రజామోదాన్ని తెస్తుందా? ప్రభుత్వానికి, సీఎంకు మంచి పేరు వస్తుందా? భవిష్యత్తులో పరిపాలనా పరంగానేగాక, రాజకీయంగానూ లాభిస్తుందా? ఇవన్నీ ఎలాగున్నా మరి, సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం అదేదో సినిమా డైలాగులా ‘మగాడురా బుజ్జీ!’ అని నిలబెట్టిందా!?

పొలిటికల్ మైండ్ గేమ్ లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలే కాదు, ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు కూడా అస్త్రాలుగా ఉపయోగపడతాయి. ఒక్కోసారి ఓ చిన్న సానుకూల పరిణామం కూడా ప్రత్యర్థుల విమర్శలకు సమాధానమవుతుంది. హైదరాబాద్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట ప్రారంభోత్సవంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొని, చేసిన వ్యాఖ్యలు అలాంటి పరిణామాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైడ్రా కార్యకలాపాలకు ఈ సంఘటన ఒక కొత్త కోణాన్ని, అంగీకారాన్ని, సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాల్ని ఊతంగా ఆవిష్కరించిందనడంలో సందేహం అక్కర లేదు.

కూల్చివేత నుండి రూపుదాల్చే వరకు!
2024 ఆగస్టు 24న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందన్న, ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో హైడ్రా కూల్చివేసింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. నాగార్జున కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే, కాలం గిర్రున తిరిగింది. సీన్ రివర్స్ అయింది. రెండేళ్ల తర్వాత అదే తమ్మిడికుంట పునరుద్ధరణ కార్యక్రమంలో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, హైడ్రాను ఆకాశానికెత్తారు. ‘తొలిసారి రంగనాథ్‌ను కలిసినప్పుడు తన మనసులో కొన్ని ముందస్తు అభిప్రాయాలు ఉన్నాయని, ఆయన ఓపికగా వివరించిన తర్వాత చెరువుల పరిరక్షణ ఆవశ్యకతను అర్థం చేసుకున్నా’నని నాగార్జున చెప్పడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా ‘హైదరాబాద్ మహా నగరంలోని రెండు వేల చెరువులను ఇదే తరహాలో పునరుద్ధరించాల’ని ఆకాంక్షించారు. ఆహ్వానిస్తే, మూసీ పునరుద్ధరణ ప్రారంభోత్సవానికి కూడా వస్తానని ప్రకటించారు.

నాగార్జున క్రెడిట్ కొట్టేశారా?
నాగార్జున పరిణతితో ప్రవర్తించారు. ప్రభుత్వానికి సహకరించారు. తన ఆక్రమణలో ఉన్నదన్న భూమిని వదులుకున్నారు. పైగా తనకు చెందిన 2 ఎకరాలను సర్కార్ కి అప్పగించారు. మరోవైపు రేపటి దురాక్రమణల తొలగింపులకు అవరోధాలు లేకుండా సాఫీగా జరిగేందుకు దోహదపడ్డారు. ప్రారంభోత్సవానికి వస్తానంటూ మూసీ ప్రాజెక్టుకు తన మద్దతు పలికారు. ఆ విధంగా ప్రజా మద్దుతు, ఆమోదాన్ని కూడా కూడగట్టేందుకు దోహదపడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జునను ‘నిజజీవితంలోనూ హోరోగా వ్యవహరించార’ని అభినందించారు. పైగా తాను చేసిన ఈ సాహసంతో నాగార్జునే హైడ్రాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారే అవకాశాన్ని సుగమం చేసుకున్నారు.
గతంలో ప్రభుత్వంతో విభేదించిన వ్యక్తే, ఇప్పుడు అదే ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రశంసించడం అనూహ్యమే, ఆశ్చర్యమే! అంతేకాదు, తమ్మిడికుంట అభివృద్ధికి, నాగార్జున తనకు చెందిన 2 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు సీఎం వెల్లడించారు. వ్యక్తిగత వివాదాన్ని పక్కనపెట్టి ప్రజా ప్రయోజనానికి సహకరించడం ద్వారా నాగార్జున ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రభుత్వానికి సహకరించిన ప్రముఖుడిగా నిలిచారు.

సీఎంకు కలిగిన ప్రయోజనాలేంటి?
హైడ్రా కూల్చివేతలు నిస్సందేహంగా, నిక్కచ్చిగా బాధితులను బాధించేవే. ప్రతిపక్షాలకు లాభించేవే. ప్రభుత్వానికి నష్ట పరిచేవే. అయితే, కొందరి ప్రయోజనాలను పక్కన పెట్టి, దీర్ఘకాలికంగా, భవిష్యత్తు తరాల బాగుకోసం చేపట్టిన హైడ్రా వంటి కార్యక్రమాలకు ప్రజా మద్దతును కూడగట్టడం అంత ఈజీ కాదు. పైగా విపక్షాల విమర్శల దాడిని తట్టుకుని నిలబెట్టడం కత్తిమీద సామే. కానీ, తమ్మిడి కుంట పునరుద్ధరణతో వాటిని సాధించిడంలో సీఎం సక్సెస్ అయ్యాడనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

తమ్మిడి కుంట ప్రారంభోత్సవంలో నాగార్జునని నిజ జీవితంలోనూ హీరోగా వ్యవహరించారన్న సీఎం రేవంత్ రెడ్డి, నిజంగా తానే హీరో అయ్యారు. అభిమానుల గ్రీకు వీరుడు నాగార్జునతో సినీ గ్లామర్ ని తోడు చేసి, హైడ్రాకి ఆమోద గ్లామర్ అద్దారు. తద్వారా ప్రతిపక్ష, విమర్శకుల నోటికి తాళం వేసి, చెక్ పెట్టడమేగాక, హైడ్రాకు సర్వామోదాన్ని కూడగట్టే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో హైడ్రాకు ప్రజలనుంచి వ్యతిరేకత తగ్గించడమేగాక, సానుకూలత పెంచారు. మహానగరంలో ప్రబలంగా ఉన్న నాగార్జున సామాజిక వర్గాన్ని తొలుత నొప్పించినా, తర్వాత మెప్పించ గలిగారు. వీటన్నింటి ద్వారా భవిష్యత్తులో ఆ సామాజిక వర్గంతోపాటు, హైడ్రా బాధితుల ఓట్లను పదిల పరుచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నిజానికి హైడ్రా ప్రారంభంలోనే ఆక్రమణల తొలగింపులు, కూల్చివేతలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బాధితుల ఆందోళనలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. అలాంటి పరిస్థితుల్లో గతంలో హైడ్రా చర్యలతో ప్రభావితమైన ప్రముఖుడే, దాని పనితీరును ప్రశంసించడం ప్రభుత్వానికి, హైడ్రాకు కూడా నైతికంగా, రాజకీయంగా అనుకూల పరిణామమే. ఇక సినీ గ్లామర్‌కు ప్రజల్లో ఉండే ఆదరణను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.

అయితే, ఈ ఒక్క సంఘటనతో హైడ్రాకు సంపూర్ణ ప్రజామోదం లభించిందని చెప్పలేం. బాధితుల సమస్యలు పరిష్కరించడం, నోటీసులు, విచారణ, న్యాయపరమైన ప్రక్రియలను పారదర్శకంగా పాటించడం ద్వారానే ప్రజామోదం లభిస్తుందని గుర్తించాలి. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం, హైడ్రా వ్యవహరించాలి.

మరోవైపు, మూసీ పునరుద్ధరణ వంటి భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం, ప్రజల విశ్వాసాన్ని పొందాల్సి ఉంది. అక్కడ కూడా తమ్మిడికుంట తరహాలో పునరావాసం, పారదర్శకత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, అసలైన విజయం ప్రశంసల్లో కాదు, భవిష్యత్తులో చెరువులు కబ్జాలకు గురికాకుండా కాపాడటంలో, బాధితులకు న్యాయం చేయడంలో ఉంది. నాగార్జున ప్రశంసలు హైడ్రాకు ప్రచార బలాన్ని ఇచ్చి ఉండవచ్చు. కానీ, హైడ్రాకు శాశ్వత బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాల్సింది దాని పారదర్శకమైన పనితీరు, పునరుద్ధరించిన చెరువులే!

తమ్మిడికుంట పునరుజ్జీవం!

ఒకప్పుడు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ్మిడికుంట దురాక్రమణల వల్ల 14 ఎకరాలకు తరిగిపోయింది. హైడ్రా కూల్చివేతలతో తిరిగి దాదాపు 30 ఎకరాలకు విస్తరించింది. కుంటలో పేరుకుపోయిన 30 వేల ట్రక్కులకు పైగా పూడిక, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించారు. కుంట లోతు 0.6 మీటర్ల నుంచి 4.6 మీటర్లకు పెరిగింది. నీటి నిల్వ సామర్థ్యం ఎనిమిది రెట్లు పెరిగి, 37 కోట్ల లీటర్లకు చేరింది.
దాదాపు1.6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలం, పచ్చదనం వంటి సదుపాయాలు కల్పించారు. దీంతో కుంట పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. కుంట పునరుద్ధరణ సౌందర్యానికే పరిమితం కాకుండా పర్యావరణానికి దోహద పడింది.

హైడ్రాకు నాగార్జునే బ్రాండ్ అంబాసిడరా?

తమ్మిడికుంట ఘటనలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఇదే. ఒకప్పుడు హైడ్రా చర్యలకు బాధితుడిగా నిలిచిన నాగార్జున, ఇప్పుడు చెరువుల పరిరక్షణకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ప్రారంభోత్సవానికి వస్తామంటూ మూసీ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి, హైడ్రాకు ప్రచారపరంగా ఉపయోగపడే అంశం.

ఇక నటి సమంత నాగార్జున కోడలుగా ఉన్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను చేనేతల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇప్పుడు నాగార్జున వ్యవహారశైలిని చూస్తుంటే, రేపు ఆయనే హైడ్రాకు బ్రాండ్ అంబాసిడర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Latest News

గీ తాపీ మేస్త్రీలు ఖాకీలే!|ADUGU TRENDS

ఖాకీలంటే కరడుగట్టిన మనసులు. చేతిల లాఠీలు, నోటి నిండా బూతులనే గిప్పటి దాకా మనకు తెలుసు. కానీ, గా బెంగళూరుల పోలీసులు గట్ల కాదని నిరూపించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి. గా బెంగళూరుల జ్ఞాన...

భారత్ కు సవాల్ గా హసీనా అప్పగింత!?|EDITORIAL

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు హసీనాను ఆ దేశానికి అప్పగించాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? హసీనా భవితవ్యం మాత్రమే కాదు. దక్షిణాసియాలో...

నవంబర్ 13, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం నాగుల చవితి తిధి శు.చవితి సాయంత్రం 05.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం మూల పగలు 03.23 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ధృతి రాత్రి తెల్ల 04.22 వరకు ఉపరి శూల కరణం భద్ర రాత్రి...

పాపం… పవన్ కళ్యాణ్!?|PAWANKALYAN|PSPK|AP|DEPUTY CM|PERSONAL ISSUE

-అచ్చిరాని ‘మూడు ముళ్ళు’! -మూన్నాళ్ళ ముచ్చటగా పెళ్ళిళ్ళు!! -ముచ్చటగా.. మూడో ‘సారీ..’!!! పాపం పవన్ కళ్యాణ్! మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు! ఎందుకనో?, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

8 లచ్చల గాజులతోటి అమ్మవారికి అలంకరణ!|ADUGU TRENDS

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అనేక రకాలుగ అలంకరిత్తరు. దేవి శరన్నవరాత్రులల్ల రోజుకో పత్యేక రూపంల అమ్మవారు భక్తులకు దర్శనమిత్తరు. బంగారు కవచంతోటి, చిన్న పిల్లల రూపంల, గంటె చేతిల పట్టుకుని భిక్షపాత్రతోటి...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఇంకెన్నాళ్ళు!?|EDITORIAL

ప్రజల ప్రాణాలకంటే పండుగ సంబరాలే ముఖ్యమా? కాలుష్య నియంత్రణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై అనుమానాలు ఢిల్లీ వాసులను కాలుష్యం కంటే ఎక్కువ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చివరకు కాలుష్యం కూడా రాజకీయ...

నవంబర్ 12, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.తదియ పగలు 03.24 వరకు ఉపరి చవితి నక్షత్రం జ్యేష్ఠ పగలు 12.51 వరకు ఉపరి మూల యోగం సుకర్మ రాత్రి తెల్ల 03.51 వరకు ఉపరి ధృతి కరణం గరజి పగలు 03.25...

సర్కారు కొలువులు..|GOVERNMENT JOBS|AP|

720 గ్రూప్‌-2 పోస్టులు! డిసెంబరు 11 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 21న ప్రిలిమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేస్తూ యువతలో ఆశలు చిగురింపజేస్తోంది....

మా దారులు వేర్వేరు|SONIA GANDHI|LIFE HISTORY|CONGRESS

మోదీ నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడరు మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం ఆనాడు ఒత్తిడితోనే ఒప్పుకున్నా.. వ్యతిరేకించిన రాహుల్, ప్రియాంక ఆ తర్వాత మన్మోహన్ ను ప్రతిపాదించా పీవీ రాజనీతిజ్ఞుడు.. ఆయనతో శత్రుత్వం లేదు రాజీవ్ హత్య కేసు దర్యాప్తుపైనే విభేదాలు ఆనాడు...

గా దేవునికి పన్నెండొందల రకాల నైవేద్యాలు!?|ADUGU TRENDS

పతి రోజూ దేవుడికి నైవేద్యం పెడ్తరని తెలుసు. కానీ ఎన్ని రకాల వైవేద్యాలు పెడ్తరు? భక్తుల శక్తి కొద్ది, శేతనైనంతల, ఆచారం, పండుగలను బట్టి ఒకటో, మూడో, ఐదో రకాలు పెడ్తరు. పండ్లు,...

డెమొక్రాట్లకు పునరుజ్జీవం!|EDITORIAL

అమెరికా మధ్యంతర ఎన్నికలు అగ్రరాజ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ట్రంప్ దూకుడుకు ఓటర్లు బ్రేక్ వేయగా, డెమొక్రాట్లకు పట్టం కట్టారు. మారిన ఈ రాజకీయ సమీకరణాలు అమెరికా భవిష్యత్తుతోపాటు ప్రపంచ దౌత్యంపై...

నవంబర్ 11, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిధి శు.విదియ పగలు 01.30 వరకు ఉపరి తదియ నక్షత్రం అనురాధ ఉదయం 10.31 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం అతిగండ రాత్రి తెల్ల 03.25 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ పగలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News